HYD: పల్లె బాట పట్టిన పట్టణం

ఓటేసేందుకు భారీగా తరలిన ఆంధ్రులు... కిటకిటలాడుతున్న ప్రయాంణ ప్రాంగాణాలు;

Update: 2024-05-11 02:00 GMT

ఎన్నికల్లో ఓటేసేందుకు ప్రజలంతా పట్టణాన్ని వదిలి పల్లెబాట పడుతున్నారు. దీంతో హైదరాబాద్‌లోని ప్రయాణ ప్రాంగణాల్లో రద్దీ నెలకొంది. బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ప్రజల రవాణా కోసం ఆర్టీసీ, రైల్వే ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేసినట్లు చెప్పినప్పటికీ సౌకర్యాల్లో కొరత ఉందంటూ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని అవాంతరాలేదురైనా కచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటామని...ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు.


ఓట్ల పండుగ కోసం నగరవాసులు...పల్లెబాట పట్టారు. తమ సొంత ఊర్లో ఓటేసేందుకు భారీగా తరలివెళ్తున్నారు. ఈ నెల 13న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్తున్న ప్రజలతో నగరంలోని ప్రయాణ ప్రాంగణాలైన... రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ప్రయాణీకులకు తగ్గట్టుగా బస్సులు, రైళ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు వాహనాల ద్వారా వెళ్దామంటే మామూలు రోజులతో పోలిస్తే మూడు, నాలుగింతలు ఎక్కువగా వసూలు చేస్తున్నారని వాపోతున్నారు.


ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం , తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఒంగోలు, గుంటూరు తదితర జిల్లాలకు వెళ్లేవారితో ఎల్బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్, కూకట్‌పల్లి , సాగర్‌ రింగ్‌రోడ్‌, ఉప్పల్‌ బస్టాప్‌లు ప్రయాణికులతో నిండిపోయాయి. ఓటింగ్‌ సమయానికి వెళ్తే జనాభా ఎక్కువగా ఉంటుందని... ముందే బయల్దేరినప్పటికీ...రవాణాకు సరైన సదుపాయాలు లేవని ప్రజలు వాపోతున్నారు. ఏదేమైనా ఖచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటామంటున్నారు. ఎన్నికలకు మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉండటంతో... మరింత మంది ఏపీకి వెళ్లే అవకాశం ఉంది. దీంతో బస్సు సర్వీసులు పెంచి ప్రైవేటు వాహన యజమానుల దోపిడీని అరికట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు..

Tags:    

Similar News