శ్రీకాకుళంలో ఉద్దానం సమస్యను తానే బయటకు తీసుకొచ్చినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆనాటి సీఎం చంద్రబాబు రూ.61 కోట్లతో ఉద్దానం ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లారన్నారు. కడపలో ఇంత నీటి సమస్య ఉందనుకోలేదని తెలిపారు. ఈ ప్రాంతం నుంచి ఇద్దరు సీఎంలు అయినందున సమస్యలు తీరిపోయి ఉంటాయనుకున్నానని పేర్కొన్నారు. తాగు నీటి కోసం ఎక్కడా ఇబ్బంది రాకూడదనేదే కూటమి ప్రభుత్వం లక్ష్యమని వెల్లడించారు.
అత్యధికంగా లైబ్రరీలు ఉన్న ప్రాంతం రాయలసీమ అని, ఇదొక చదువుల నేల అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. అన్నమయ్య, వేమన, పుట్టపర్తి నారాయణాచార్యులు, కేవీ రెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, గాడిచర్ల సర్వోత్తమరావు లాంటి మహానుభావులు ఇక్కడే పుట్టారన్నారు. రాయలసీమ అంటే అభివృద్ధిలో వెనుకబాటు కాదని, అవకాశాల కోసం ముందుండి నడిచే ప్రాంతం కావాలని ఆకాంక్షించారు.