OIL PRICES: తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న వంటనూనె ధరలు
నూనె దిగుమతిపై 20 శాతం సుంకం పెంపు... 30 శాతం అధిక ధరలతో వంటనూనెల విక్రయాలు;
తెలుగు రాష్ట్రాల్లో వంట నూనె ధరలు అమాంతం పెరగనున్నాయి. నూనె దిగుమతి పై 20 శాతం సుంకం పెంచనున్నట్టు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ప్రకటించింది. అయితే.. ఇది పూర్తీస్థాయిలో ఇంకా అమల్లోకి రాలేదు. కానీ అప్పుడే డీలర్లు సిండికేట్ అయ్యారు. కృత్రిమ కొరత సృష్టించారు. డీలర్ల వద్ద ఉన్న పాత స్టాక్ కు కొత్త ధర జోడించి అమ్మేందుకు సిద్ధమయ్యారు. ధర పెంచుతున్నట్టు కేంద్రప్రభుత్వం శుక్రవారం రాత్రి ప్రకటించింది. శనివారం ఉదయం నుంచే 30 శాతం అధిక ధరలతో డీలర్లు వంట నూనె విక్రయాలు మొదలుపెట్టారు.
ఆయిల్ అమ్మకాలు రెండు రకాలు. ఒకటి లూజ్ ఆయిల్ అమ్మకం. రెండోది ప్యాక్డ్ ఆయిల్ అమ్మకం. వాస్తవానికి కేంద్రం లూజ్ ఆయిల్ పై మాత్రమే సుంకం పెంచింది. ప్యాక్డ్ ఆయిల్ మీద కాదు. కానీ డీలర్లు మాత్రం ప్యాక్డ్ ఆయిల్ పై కూడా ధరలు పెంచేశారు. సుంకం పెరిగిందనే ప్రకటనే రాగానే స్టాక్ లో ఉన్న ఆయిల్ అమ్మకం ఆగిపోయింది. ధర పెరిగిందంటూ చిల్లర వ్యాపారులుకు సమాచారం ఇచ్చేశారు. వెంటనే పాత స్టాకునే కొత్త స్టాకు పేరుతో ధరపెంచి అమ్మేస్తున్నారు. 15 కిలోల నూనె డబ్బా రూ. 1600 ఉంటే.. ప్రస్తుతం రూ.1900 నుంచి రూ.2వేల వరకు అమ్ముతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది రూపాయల నూనె విక్రయాలు ఇలానే జరుగుతున్నాయి. డీలర్లు ఇష్టారాజ్యంగా ధరలు పెంచి అమ్ముతున్నా కట్టడి చర్యలు లేవు. ధర పెరగుతుందని తెలిసినా రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. ఒక్క ఉపశమన ప్రకటన కూడా లేదు. అధిక ధరలకు అమ్మతున్న డీలర్ల పైనా ఎలాంటి చర్యలు లేవు. వరుసగా మూడు రోజులు సెలవు వచ్చింది.
అధికారులు సెలవు పై ఉంటారు. పట్టంచుకునేనాథుడు ఉండడు. ఇదే అదునుగా డీలర్లు ఇష్టారాజ్యంగా ధరలు పెంచి వంట నూనె అమ్ముతున్నారు. డీలర్ల సిండికేట్ లో అధికారుల పాత్ర కూడా ఉందనే విమర్శ వినిపిస్తోంది. అధికారులు కాసులకు కక్కుర్తి పడి డీలర్ల సిండికేట్ వ్యవహారాన్ని పట్టించుకోవడంలేదన్న వాదన వినిపిస్తోంది. కరోన సమయంలో కూడా ఈ స్థాయిలో ధరలు పెరగలేదని వినియోగదారులు వాపోతున్నారు. వంటనూనె ధరల పెరుగుదల పై ప్రభుత్వం ఉపశమన ప్రకటన ఇవ్వాలని కోరుతున్నారు. డీలర్ల సిండికేట్ వ్యవహారం పై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. వంటనూనె ధర పెరుగుదల పై కేంద్ర ప్రభుత్వం మరో వాదన చేస్తోంది. ``ఇండియా ప్రపంచంలోనే పెద్ద క్రూడ్ ఎడిబుల్ ఆయిల్ దిగుమతిదారు. అదే సమయంలో దేశంలో ఎంతో మంది రైతులు ఎడిబుల్ ఆయిల్ పంటలు సాగుచేస్తున్నారు. మార్కెట్ లో తక్కువ ధర కారణంగా రైతులు నష్టపోతున్నారు. ``వారిని ఆదుకోవడానికి క్రూడ్ ఎడిబుల్ ఆయల్ దిగుమతి పై సుంకం పెంచినట్టు కేంద్రం చెబుతోంది. రైతులను ఆదుకోవడానికి ధరలు పెంచామని కేంద్రం చెబుతోంది. కానీ డీలర్లు మాత్రం సిండికేట్ అయ్యి వినియోగదారుల్ని ఇబ్బందిపెడుతున్నారు. డీలర్ల ఆగడాలు కట్టడి చేయడం ద్వార ఒకవైపు వినియోగదారుల్ని ఆదుకోవచ్చు. మరోవైపు రైతులకు మద్దతు ధర ఇవ్వొచ్చు. ఈ రెండింటిని ప్రభుత్వం జాగ్రత్తగా పర్యవేక్షించాలి. దిగుమతి సుంకం పెంచిన నేపథ్యంలో దేశీయ రైతుల నుంచే ఎడిబుల్ ఆయిల్ కొనుగోలు చేయాలి. ధరల్ని నియంత్రించి వినియోగదారుడిని కాపాడాలి. లేదంటే వినియోగదారుడు నిలువునా మునిగిపోతాడు.