IPS Officer PV Sunil Kumar : ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్ సస్పెన్షన్ పొడిగింపు
ఐపీఎస్ అధికారి పి.వి. సునీల్ కుమార్ సస్పెన్షన్‌ను ఏపీ ప్రభుత్వం వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 వరకు పొడిగించింది. ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశీ పర్యటనలకు వెళ్లిన ఆరోపణలు నిరూపణ కావడంతో ఇప్పటికే ఆయన సస్పెన్షన్‌లో ఉన్నారు. సునీల్ కుమార్ సస్పెన్షన్ గడువు మరో రెండు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో, రివ్యూ కమిటీ ఆయన కేసును సమీక్షించింది. సునీల్ కుమార్‌పై అగ్రిగోల్డ్ నిధుల దుర్వినియోగం కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. అలాగే గతంలో ఎంపీగా ఉన్న ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధించిన కేసులోనూ గుంటూరు నగరపాలెం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సస్పెన్షన్ ఎత్తివేస్తే, సాక్ష్యాధారాలు, దర్యాప్తును ప్రభావితం చేయవచ్చని రివ్యూ కమిటీ తన నివేదికలో పేర్కొంది. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున సస్పెన్షన్‌ను పొడిగించాలని కమిటీ సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో తదుపరి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం డీజీపీని ఆదేశించింది. కమిటీ సిఫార్సుల మేరకు, సునీల్ కుమార్ సస్పెన్షన్ ఆదేశాలను పొడిగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయన సస్పెన్షన్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 వరకు కొనసాగనుంది.