Sri Krishna Devaraya University : ఎస్‌కేయూలో అక్రమాలు: కఠిన చర్యలకు సిద్దమైన ప్రభుత్వం

Update: 2025-09-27 09:06 GMT

అనంతపురం శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్‌కేయూ)లో 2019 నుంచి 2024 మధ్య జరిగిన అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ప్రకటించారు.

ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, 2019-24 కాలంలో ఎస్‌కేయూలో నిధుల దుర్వినియోగం, చట్టవిరుద్ధమైన పదోన్నతులు, సస్పెన్షన్లు జరిగాయనేది వాస్తవమేనని అంగీకరించారు. ఈ విషయాలపై ఫిర్యాదులు అందినట్లు తెలిపారు.

కీలక ఆరోపణలు, నిధుల వివరాలు ఎస్‌కేయూలో అందిన ఫిర్యాదుల్లో ప్రధానంగా ఈ అంశాలు ఉన్నాయి:

కంప్యూటర్ల కొనుగోలులో దుర్వినియోగం.. విశ్వవిద్యాలయ వాహనాలను వ్యక్తిగత ఉపయోగానికి వినియోగించడం

నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతులు, నియామకాలు రిక్రూట్‌మెంట్‌లో రిజర్వేషన్ నిబంధనలు ఉల్లంఘించటం

విశ్వవిద్యాలయం బ్యాంకు ఖాతాలలో ప్రస్తుతం వంద కోట్లకు నగదు ఫిక్స్‌డ్ డిపాజిట్లుగా అందుబాటులో ఉన్నట్లు మంత్రి లోకేశ్ సభకు తెలియజేశారు.

విచారణకు ప్రత్యేక కమిటీ ఈ ఆరోపణలపై సమగ్రంగా, విశ్లేషణాత్మకంగా విచారణ జరిపేందుకు ఒక ప్రత్యేక కమిటీని నియమిస్తామని మంత్రి ప్రకటించారు. ఈ కమిటీ 100 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తామని తెలిపారు.

నివేదిక అందిన తర్వాత బాధ్యులపై తప్పక చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. "ప్రజాప్రభుత్వం లక్ష్యం విశ్వవిద్యాలయాల పాలనను పారదర్శకంగా నడిపించడమే. ఎవరైనా నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తే, వారిపై చర్యలు తప్పవు" అని మంత్రి ఈ సందర్భంగా హెచ్చరించారు.

Tags:    

Similar News