JAGAN: జగన్ గారూ..అసెంబ్లీ మీద అలిగితే ఎవరికి నష్టం.?
జగన్ తీరుపై సర్వత్రా విమర్శలు
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి... మరోసారి శాసనసభ సమావేశాలకు డుమ్మా కొట్టారు. తొలి రోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు ఎవ్వరూ రాలేదు. శాసనమండలికి మాత్రం వైసీపీ ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అయితే జగన్ ఈ సమావేశాలకు హాజరుకాకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తే తప్ప.. అసెంబ్లీకి రానంటూ వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ భీష్మించడం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. పార్టీకి సభలో ఎంత మంది సభ్యులు ఉన్నా.. ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టామా లేదా అన్నదానికే రాజకీయ పార్టీలు ప్రాధాన్యమిస్తాయి. జగన్ దానిని పక్కనపెట్టి.. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సిందేనని.. సీఎం ఎంతసేపు మాట్లాడితే తనకూ అంతే సమయం ఇవ్వాలని షరతులు పెట్టడంపై రాజకీయ నిపుణులు సహా ఆ పార్టీ వారే విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
జగన్ శాసనసభ్యుడు మాత్రమే..
58 మంది సభ్యుల ఏపీ శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీల సంఖ్యాబలం 34. అధికార కూటమి (13) కంటే ఎక్కువగా ఉండడంతో వైసీపీ పక్ష నేతగా బొత్సకు ప్రతిపక్ష నాయకుడి హోదా లభించింది. అధికారికంగా క్యాబినెట్ ర్యాంకు కూడా దక్కింది. అవసరమైనప్పుడు సభలో కాస్త ఎక్కువ సమయమే మాట్లాడే అవకాశం కూడా బొత్సకు లభిస్తోంది. జగన్ శాసనసభ్యుడు మాత్రమే. పొరుగు సభలో బొత్స సత్యనారాయణ ప్రతిపక్ష నేత హోదాలో ఉంటే.. తాను కేవలం ఎమ్మెల్యేగా ఉండడంతో అహం అడ్డొచ్చి జగన్ అసెంబ్లీకి రానంటున్నారని వైసీపీ నేతలు బాహాటంగానే గుసగుసలాడుతున్నారు. వాస్తవానికి మండలిలో ప్రతిపక్ష నేతగా బొత్స ఉన్నప్పటికీ.. మిగతా వైసీసీ ఎమ్మెల్సీలు కూడా ప్రజా సమస్యలపై చర్చల్లో పాల్గొంటున్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాదనలు గట్టిగానే జరుగుతున్నాయి. విపక్షానికి ఎక్కువ సమయం దొరుకుతున్నా.. ప్రభుత్వం కూడా అభ్యంతరపెట్టకుండా చర్చలు సాగిస్తోంది.
జగన్ బలాన్ని మర్చిపోతే ఎలా..?
2024 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ పార్టీకి దాదాపు 40 శాతం ఓట్లు వచ్చాయి. అంటే కోటి, ముప్పయ్ రెండు లక్షల, ఎనభై నాలుగు వేల, నూట ముప్పయ్ నాలుగు (1,32,841,34) ఓట్లు లభించాయి. 2019–2024 మధ్యకాలంలో పాలనకు లభించిన అవకాశాన్ని వినియోగించుకుని జగన్ భారీ విధ్వంసాన్ని చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అయినా నలభై శాతం మంది ప్రజలు జగన్ వెంట నడిచారు. ఇది చిన్న విషయం కాదు. జనసేన పేరుతో ప్రజా జీవితంలోకి 2014లో మహా దూకుడుగా అడుగుపెట్టిన పవన్ కల్యాణ్ వెంట దశాబ్దం తరువాత కూడా ఆరేడు శాతానికి మించి ఓటర్లు నడవలేదు. అందుకే, జగన్ వెంట నడిచిన 40 శాతం ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళాల్సిన నైతిక బాధ్యత జగన్ పార్టీకి ఉన్నది. వారి పొలాలకు నీరు సక్రమంగా అందుతున్నదా, వారి వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లభిస్తున్నాయా, వాళ్ళ పిల్లలకు ‘తల్లికి వందనం’ నిధులు లభించాయా, వారికి ఆరోగ్యశ్రీ సహాయం లభిస్తున్నదా, వారి మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణంలో ఇబ్బందులు ఉన్నాయా, పోలీస్ స్టేషన్లలో వారికి ఏమైనా అన్యాయాలు జరుగుతున్నాయా... వంటి సవాలక్ష అంశాలపై ప్రభుత్వం సరిగా వ్యవహరించకపోతే నిలదీయాల్సిన అవసరాన్ని వైసీపీ గుర్తించలేకపోతోంది.