గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో సత్యవర్థన్ 164 స్టేట్ మెంట్ రికార్డు చేసే అవకాశముంది. ఇప్పటికే సత్యవర్థన్ స్టేట్‌మెంట్ రికార్డు కోసం కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. ప్రస్తుతం జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీకి బెయిల్ పై బయటకు తీసుకు వచ్చేందుకు వైసీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జిల్లా కోర్టులో వల్లభనేని వంశీ తరుపున ఆయన న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేయనున్నారు.
మరోవైపు, విజయవాడ జిల్లా జైలులో ఉన్న వంశీని వైసీపీ అధినేత జగన్ రేపు కలవనున్నారు. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న జగన్ మంగళవారం విజయవాడకు రానున్నారు. విజయవాడ చేరుకున్న తర్వాత నేరుగా ఆయన జైలుకు వెళ్లి, ములాఖత్‌లో వంశీని కలుస్తారు. జైల్లో వంశీని ఉంచిన సెల్ వద్ద భద్రతను పెంచారు. అదనంగా గార్డులను నియమించారు. తోటి ఖైదీలు అక్కడకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సెల్ వద్ద అడ్డంగా ఒక వస్త్రాన్ని కట్టారు. జైల్లో బ్లేడ్ బ్యాచ్, గంజాయి కేసుల నిందితులు ఉండటంతో... వారి నుంచి వంశీకి హాని కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.