గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన పార్టీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాజలింగం స్పష్టం చేశారు. కూకట్పల్లి నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కేపీహెచ్బీలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జనసేన రాష్ట్ర ఇన్చార్జి నేమూరి శంకర్‌గౌడ్ మాట్లాడుతూ, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై నాయకులు దృష్టి సారించాలన్నారు. కార్యకర్తల సమీకరణ ద్వారా పార్టీని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని ఆయన సూచించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జనసేన నియోజకవర్గ ఇన్చార్జి ప్రేమ్‌కుమార్, వీర మహిళ చైర్మన్ కావ్య, ప్రధాన కార్యదర్శి దామోదర్‌రెడ్డితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏపీలో యాక్టివ్ గా ఉన్న జనసేనను తెలంగాణలో కూడా ఫామ్ లోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికా రూపొందిస్తున్నట్టు కనిపిస్తుంది. హైదరాబాద్‌లో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయడానికి పార్టీ పూర్తిగా సిద్ధంగా ఉందని జనసేన గ్రేటర్ అధ్యక్షుడు రాజలింగం ప్రకటించారు.
సత్తా చాటేందుకు వ్యూహాలు
సమావేశంలో GHMC ఎన్నికల్లో జనసేన సత్తా చాటేందుకు పలు వ్యూహాలపై విస్తృతంగా చర్చించారు. బూత్ స్థాయి కేడర్‌ను బలోపేతం చేయడం, ప్రతి డివిజన్‌కు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేయడం, యువత, మహిళలపై దృష్టి పెట్టడం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయని తెలిపారు. నాయకులు ప్రజల వద్దకు చేరుకునే డోర్-టు-డోర్ ప్రచార కార్యక్రమాలపై కూడా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు స్పష్టం చేశారు. స్థానిక ప్రజా సమస్యలు, GHMCలో పరిష్కారం కావాల్సిన ముఖ్య అంశాలపై వర్క్‌లిస్ట్ తయారు చేయాలని నేతలకు సూచించారు.(GHMC)లో మొత్తం 150 డివిజన్లు (కార్పొరేటర్ సీట్లు) ఉన్నాయి. ఈ 150 సీట్లలో 76 సీట్లు గెలిస్తేనే ఒక పార్టీకి స్పష్టమైన మెజారిటీ లభిస్తుంది. సాధారణంగా GHMC ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఎక్కువగా ఉండటంతో.. ఈ మెజారిటీని సాధించడం కష్టంగా అభిప్రాయపడుతున్నారు. GHMC పరిధిలో ఓటర్ల సంఖ్య కూడా భారీగా ఉంటుంది. తాజా లెక్కల ప్రకారం, నగరంలో మొత్తం 92.5 లక్షలకుపైగా ఓటర్లు నమోదు అయ్యారు. అర్బన్ ఓటర్లలో యువత శాతం ఎక్కువ కావడంతో, GHMC ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రభావం గణనీయంగా కనిపిస్తుంది.