AMARAVATHI: అమరావతి నిర్మాణంలో కీలక ముందడుగు

రుణాలు మంజూరు చేస్తూ ఏడీబీ క్లియరెన్స్‌... రూ .31 వేల కోట్లు టైఅప్ చేశామన్న సీఆర్డీఏ కమిషనర్;

Update: 2024-12-13 02:30 GMT

రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక అడుగు పడింది. అమరావతికి ఆసియా అభివృద్ధి బ్యాంక్ శుభవార్త చెప్పింది. రూ.15 వేల కోట్ల రుణాలు మంజూరు చేస్తూ క్లియరెన్స్ ఇచ్చింది. అమరావతి రాజధాని పనులు పున:ప్రారంభానికి రూ.20,500 కోట్ల సీఆర్డీఏ ద్వారా పరిపాలనా ఆమోదం తీసుకున్నట్లు కమిషనర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి రూ. 31 వేల కోట్లు టైఅప్ చేశామన్నారు. నిధుల మంజూరుతో అభివృద్ధి పనులు జోరందుకోనున్నాయి.ప్రపంచ బ్యాంకు నుంచి రుణ సమీకరణ యత్నాలు కూడా కొలిక్కి వచ్చాయి. ఈ నెల 17న జరగనున్న బ్యాంకు బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనకు అనుమతి వస్తుందని ఆశిస్తున్నారు. మొత్తంగా రెండు బ్యాంకుల నుంచి రూ.13,600 కోట్ల రుణం అందనుంది. మరో రూ.1,400 కోట్లను కేంద్రం మంజూరు చేయనుంది. ఈ నెలాఖరు నాటికి మొత్తం అప్పులో 25శాతం రూ.3,750 కోట్లు అడ్వాన్సు రూపంలో ఇస్తారు. ఈ రుణంపై ఐదేళ్ల పాటు మారటోరియం ఉంటుంది. ఐదేళ్ల తర్వాత చెల్లింపు ప్రక్రియ మొదలవుతుంది. 6నెలలకు ఒక వాయిదా చొప్పున 23 సంవత్సరాల పాటు రుణం చెల్లించే వెసులుబాటు ఉంది. ఈ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం కీలక పనులు చేపట్టనుంది.


గ్రోత్‌ హబ్‌గా అమరావతి

అమరావతి ప్రాంతాన్ని గ్రోత్‌ హబ్‌గా తీర్చిదిద్దడంతో పాటు అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, ల్యాండ్‌ పూలింగ్‌లో భూములు ఇచ్చిన రైతులకు మేలు చేయడంతో పాటు గ్రీన్‌ అండ్‌ స్మార్ట్‌ సిటీ అభివృద్ధిలో భాగంగా మౌలిక సదుపాయాల కల్పన, పచ్చని ప్రదేశాల అభివృద్ధి, నీరు, పారిశుధ్యం, కర్బన ఉద్గారాలను తక్కువగా వెలువరించే రవాణా సదుపాయాలకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వనుంది. వరద ముప్పును తగ్గించడానికి డ్రయినేజీ వ్యవస్థలను మెరుగుపరుస్తారు. పెట్టుబడిదారులను ఆకర్షించడంలో ప్రభుత్వానికి మద్దతు ఇస్తారు. ప్రైవేట్‌ పెట్టుబడులు సృష్టించి మహిళలు, యువతకు కొత్త ఉద్యోగాలను సృష్టిస్తారు.

ఏడీబీ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు

అమరావతికి రుణం మంజూరుపై ఏడీబీ ఇండియా డైరెక్టర్‌ మియో ఓకా కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రీన్‌ఫీల్డ్‌ నగరాలను అభివృద్ధి చేయడానికి నిధులు కేటాయిస్తున్నట్టు వివరించారు. భవిష్యత్తులోను మరిన్ని నగరాల అభివృద్ధి జరగబోతోందని, వాటికి అమరావతి రోల్‌మోడల్‌గా మారబోతోందని వ్యాఖ్యానించారు. అమరావతిని గ్రీన్‌ అండ్‌ స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చేయడానికి మొత్తం 121.97 బిలియన్ల యెన్లను (రూ.6,800 కోట్లు) మంజూరు చేసినట్టు ఏడీబీ వెల్లడించింది.

Tags:    

Similar News