Leopard Attacks : శ్రీశైలం సమీపంలో చిన్నారిపై చిరుత దాడి

Update: 2025-08-15 05:57 GMT

శ్రీశైలానికి 12 కిలోమీటర్ల దూరంలోని చిన్నారుట్ల చెంచుగూడెంలో చిరుతపులి దాడి కలకలం రేపింది. బుధవారం అర్ధరాత్రి తన తల్లిదండ్రుల పక్కన నిద్రిస్తున్న మూడేళ్ల చిన్నారిపై చిరుత దాడి చేసి ఈడ్చుకెళ్లింది. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చిన్నారుట్ల చెంచుగూడెంలో కుడుముల అంజయ్య, లింగేశ్వరి దంపతుల బిడ్డపై ఈ దాడి జరిగింది. సమీప అడవి నుంచి వచ్చిన చిరుతపులి తల్లి పక్కన నిద్రిస్తున్న చిన్నారిని నోట కరుచుకుని ఈడ్చుకెళ్లింది. చిన్నారి తండ్రి అరుపులు వినగానే స్థానికులు చిరుతను వెంబడించడంతో అది గ్రామ శివారులో చిన్నారిని వదిలి వెళ్లిపోయింది. చిరుత దాడిలో గాయపడిన చిన్నారిని వెంటనే సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

ఈ ఘటన అనంతరం చిన్నారుట్ల గూడెం వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 70 ఏళ్లుగా ఈ గూడెంలో నివసిస్తున్నప్పటికీ ఐటీడీఏ అధికారులు విద్యుత్ సౌకర్యం కల్పించలేదని ఆరోపించారు. చీకటి కారణంగానే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దోర్నాల-శ్రీశైలం రహదారిపై వెళ్తున్న ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలను అడ్డగించి గంటపాటు నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న దోర్నాల అటవీ, పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని చెంచులతో చర్చించారు. వారికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Tags:    

Similar News