YSRCP MP Mithun Reddy : వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిపై లుకౌట్ నోటీసులు జారీ
రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న ఆయన దేశం విడిచి వెళ్లకుండా నిరోధించడానికి ఈ నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. లిక్కర్ స్కాం కేసులో తనను పోలీసులు అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ మిథున్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, కోర్టు ఈ పిటిషన్‌ను మంగళవారం (జూలై 15) తిరస్కరించింది. కేసు విచారణ కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వడం కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో, మిథున్ రెడ్డి విదేశాలకు వెళ్లే అవకాశం ఉందని పోలీసులు అనుమానించారు. దీనిని నివారించడానికి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల వల్ల ఆయన దేశం విడిచి వెళ్లాలంటే ముందుగా అధికారుల అనుమతి తీసుకోవాలి. లిక్కర్ స్కాం కేసులో మిథున్ రెడ్డి A4 నిందితుడిగా ఉన్నారు. గతంలో ఆన్‌లైన్ పేమెంట్ విధానాన్ని మాన్యువల్ మోడల్‌గా మార్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) కోర్టుకు తెలిపింది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు రూ. 3,500 కోట్ల నష్టం వాటిల్లిందని SIT తరపు న్యాయవాది వాదించారు. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు వేగవంతం కావడంతో, మిథున్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.