AP: దస్త్రాల దహనంపై ముమ్మర దర్యాప్తు

ఫైళ్లు తగలబెట్టినట్లు ప్రాథమిక అంచనా... మాధవరెడ్డి కోసం గాలింపు ముమ్మరం;

Update: 2024-07-27 03:30 GMT

మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతోంది. వైసీపీ పాలనలో పెద్దిరెడ్డితో పాటు ఆయన సోదరుడు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి, అనుచరుల భూకబ్జాలను ఎన్డీఏ ప్రభుత్వం వెలికితీస్తుందన్న భయాందోళనతో ఆ పార్టీ నాయకులే అధికారులపై ఒత్తిడి తెచ్చి ఫైళ్లు తగలబెట్టినట్లు విచారణ అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఈ ఘటనసై ఐదో రోజు రెవెన్యూ, పోలీసు అధికారులు సమాంతరంగా దర్యాప్తు కొనసాగించారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఆర్‌పీ సిసోదియాతో పాటు సీఐడీ చీఫ్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌ మదనపల్లెలో సమీక్షించారు. అనంతరం సిసోదియా రాయచోటికి వెళ్లగా, అయ్యన్నార్‌ విజయవాడ వెళ్లారు.

దస్త్రాల దహనం ఘటనలో అనుమానితుడైన వైసీపీ నాయకుడు మాధవరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఏడుగురు రెవెన్యూ సిబ్బంది పాత్రపైనా అనుమానాలున్నాయని రెవెన్యూ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఆర్‌పీ సిసోదియా తెలిపారు. ఫోరెన్సిక్‌ నివేదిక రాగానే బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో దాదాపు 2.16 లక్షల ఎకరాల భూములకు 22 (ఏ)ను తొలగించి ఫ్రీ హోల్డ్‌లో పెట్టారని... వీటన్నింటిపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని వివరించారు.

సీనియర్‌ అసిస్టెంట్‌ గౌతమ్‌ తేజ్‌ గత ఆదివారం సెలవు రోజైనప్పటికీ సబ్ కలెక్టర్‌ కార్యాలయానికి ఎందుకు వచ్చారన్నది పోలీసులు ఆరా తీశారు. విచారణ ప్రారంభంలో తటపటాయించిన గౌతమ్‌.. తర్వాత నోరు విప్పినట్లు తెలిసింది. ఈ నెల 20న మదనపల్లె ఆర్డీవో హరిప్రసాద్‌ స్థానంలో ఐఏఎస్‌ అధికారి మేఘస్వరూప్‌ను ప్రభుత్వం నియమించింది. సోమవారం కొత్త సబ్‌ కలెక్టర్‌ బాధ్యతలు స్వీకరిస్తారనే సమాచారంతో పలమనేరులో ఉన్న గౌతమ్‌ను ఆర్డీవో హడావుడిగా మదనపల్లెకు పిలిపించినట్లు తెలిసింది. కొందరితో చేసుకున్న ఒప్పందం మేరకు దస్త్రాల ఆధారాలను మాయం చేసేందుకు యత్నించినట్లు సమాచారం. ఈ నెల 21న ఆదివారం ఉదయం కార్యాలయానికి వచ్చిన హరిప్రసాద్, గౌతమ్‌లు రాత్రి 10.40 వరకు అక్కడే ఉన్నట్లు సీసీ కెమెరాల ఆధారంగా తెలుస్తోంది. ఇద్దరూ కలిసి రోజంతా ఫైళ్లు క్లియర్‌ చేసినట్లు విచారణలో తేలింది. గౌతమ్‌ ఇచ్చిన వివరాల మేరకు ఆర్డీవోను విచారించగా తాను సీనియర్‌ అసిస్టెంట్‌ను పిలవలేదని దాటవేసే ధోరణిలో చెప్పినట్లు తెలుస్తోంది. రాత్రి వరకు ఆర్డీవో కార్యాలయంలో ఉండి పక్కనున్న ప్రభుత్వ నివాసంలోకి వెళ్లగా, గౌతమ్‌ రాత్రి తిరిగి వెళ్లాకే మంటలు లేచినట్లు పోలీసులు అంచనాకు వచ్చారు.

Tags:    

Similar News