ఏపీలో పెను ప్రమాదం తప్పింది. శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాల భవనం అర్ధరాత్రి కూలిపోయింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భవనం దెబ్బ తినడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. అయితే రాత్రి సమయం కావడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో అంత ఊపిరి పీల్చుకున్నారు.
అల్లూరిసీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం లోని చినమునకనగడ్డ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థలో ఉంది. గత పదేళ్లుగా శిథిలంగా ఉండడంతో పక్కనే ఉన్న మరో గదిలో బోధన సాగిస్తున్నారు సిబ్బంది. ప్రస్తుతం 25 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా ఉన్న వర్షాల ప్రభావం తో భవనం దెబ్బ తిని నిన్న అర్దరాత్రి నేలమట్టం అయింది. సమాచారం తెలుసుకున్న ఎంఈవో శ్రీనివాసరావు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కాగా ప్రభుత్వ చొరవతో భవన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, తర్వలో కొత్త భవనం నిర్మాణం ప్రారంభమవుతుందని తెలిపారు.