ఆంధ్రప్రదేశ్ జైళ్ల విభాగంలో గత వైసీపీ పాలనలో భారీ స్థాయిలో అవినీతి జరిగినట్టుగా నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వివరాలు సంచలనంగా మారాయి. ముఖ్యంగా జైలు నిర్మాణ పనుల్లో ఒక ఉన్నతస్థాయి పోలీసు అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరించి, కోట్ల రూపాయలు దోచేశాడన్న ఆరోపణలు ఇప్పుడు ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. 2021లో కడప సెంట్రల్ జైలు పరిధిలో కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం ₹3.15 కోట్లు ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. ఈ నిర్మాణానికి కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ, ఆ అధికారి అన్ని అధికారాలను తన చేతుల్లోకి తీసుకుని, పూర్తిగా ఒంటరిగా నిర్ణయాలు తీసుకున్నాడు.
వాస్తవానికి అక్కడ చేసిన పని విలువ రూ.5 లక్షలు మాత్రమే కనిపిస్తోంది. అయినప్పటికీ, ప్రాజెక్టు మొత్తాన్ని ఖర్చు చేసినట్టుగా పత్రాలు సృష్టించి, భారీ మొత్తంలో నిధులను మళ్లించినట్టుగా తెలుస్తోంది. ఈ పనులను రాయల్ ఎంటర్‌ప్రైజెస్ అనే సంస్థకు అప్పగించి, ఆ సంస్థ పేరుతో నిధులను ఇష్టానుసారంగా మళ్లించుకున్నట్టు తెలుస్తోంది. అధికార స్థాయిని దుర్వినియోగం చేస్తూ, ఈ ప్రాజెక్టును డబ్బు దోపిడీ కోసం వాడుకున్నాడని సమాచారం అందుతోంది. కమిటీకి ఎలాంటి వివరాలు చెప్పకుండా ఒక్కడే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని ఇష్టారాజ్యంగా నిధులు రిలీజ్ చేసినట్టు సమాచారం.
ఈ వ్యవహారంపై ఇప్పుడు కొత్త ప్రభుత్వం దృష్టి సారించడంతో ఈ విషయంపై విచారణ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వాలు మారినా సరే సదరు ఆఫీసర్ తీరు మాత్రం మారట్లేదు. గత పాలనలో జరిగిన అడ్డగోలు డబ్బు దోపిడీలలో ఇదొకటి. ఇతాను తనకున్న పరిచయాలను అడ్డుపెట్టుకుని తన అరాచకాలను సాగిస్తున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక ప్రభుత్వ అధికారి అయి ఉండి కాంట్రాక్టర్ అవతారం ఎత్తి మరీ ఇలాంటి అవినీతికి పాల్పడ్డాడని తేలడంతో ఇది జైళ్లశాఖలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.