AP:రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్

సూపర్ సిక్స్ కు పెద్దపీట... వ్యవసాయానికి రూ. 48 వేల కోట్లు;

Update: 2025-03-01 01:30 GMT

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 2025-26 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ ప్రవేశపెట్టారు. రూ.3.22 లక్షల కోట్లతో బడ్జెట్‌ను సభ ముందు ఉంచారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. బడ్జెట్‌లో వ్యవసాయానికి రూ.48వేల కోట్లు కేటాయించారు. రెవెన్యూ వ్యయం రూ.2,51,162 కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ.40,635 కోట్లు, రెవెన్యూ లోటు రూ. 33,185 కోట్లు, ద్రవ్య లోటు రూ.79,926 కోట్లుగా అంచనా వేశారు. అన్నదాత సుఖీభవ కోసం రూ.6,300 కోట్లు, ఏపీ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు కోసం బడ్జెట్‌లో రూ.6,705 కోట్లు కేటాయించారు.

సూపర్ సిక్స్ కు పెద్దపీట

2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్​లో సంక్షేమ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. సూపర్ సిక్స్ సహా మేనిఫెస్టోలో హామీల అమలుకు 2025-26 బడ్జెట్​లో పెద్ద పీట వేశారు. అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు 20 వేలు ఇచ్చేలా కేటాయింపులు చేశారు. తల్లికి వందనం పథకం కింద కుటుంబంలో చదువుకునే ప్రతి విద్యార్థికి 15 వేలు కేటాయించారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లల్లో చదివే విద్యార్థులకు తల్లికి వందనం వర్తించనుంది. 1-12వ తరగతుల విద్యార్థులకు తల్లికి వందనం స్కీం వర్తింపు చేశారు. విద్యార్థుల తల్లుల ఖాతాలో తల్లికి వందనం డబ్బులను జమ చేయనున్నారు.

నాయి బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్

నాయీ బ్రహ్మణుల సెలూన్లకు 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా లభించనుంది. వృద్ధుల సంరక్షణ కోసం 12 వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 7 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణానికి బడ్జెట్​లో ప్రతిపాదనలు చేశారు. టిడ్కో ద్వారా 2 లక్షల ఇళ్ల నిర్మాణానికి బడ్జెట్​లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇళ్ల నిర్మాణం నిమిత్తం ఎస్సీలకు అదనంగా 50 వేలు, ఎస్టీలకు అదనంగా 75 వేలు ఇవ్వనున్నట్టు బడ్జెట్​లో వెల్లడించారు. చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు అందించే సాయాన్ని 10 వేల నుంచి 20 వేలకు ప్రభుత్వం పెంచింది. దీపం 2.0 కింద నిధుల కేటాయించారు. ఆదరణ పథకం పునఃప్రారంభించిన కూటమి ప్రభుత్వం, నిధులు కేటాయింపునకు కట్టుబడి ఉందని తెలిపింది.

Tags:    

Similar News