3.22 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇందులో రూ.48 వేల కోట్లతో వ్యవసాయ బడ్జెట్ రూపొందించారు. రాష్ట్ర బడ్జెట్ తొలిసారి 3 లక్షలు కోట్లు దాటింది. ఈ బడ్జెట్ లో తొలిసారిగా తెలుగు భాషాభివృద్ధికి 10 కోట్లు కేటాయించారు. తొలిసారిగా తెలుగు భాషకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించింది. తెలుగు భాషకు తామిచ్చే ప్రాధాన్యతను తెలియచెప్పేలా నిధుల కేటాయించారు. మద్యపానం, మాదక ద్రవ్యాల వినియోగంపై వ్యతిరేక ప్రచారం కోసం బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు చేసారు. నవోదయం 2.0 స్కీం కింద మద్యపాన, మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారం కోసం నిధుల కేటాయించారు.
పౌరసరఫరాల శాఖ
పేదలకు నిత్యావసర సరుకులు అందించే పౌరసరఫరాల శాఖకు రూ.3,806 కోట్లు కేటాయించారు. అందులో దీపం 2.0 పథకం కోసం రూ.2,601 కోట్లు కేటాయించారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉంచిన ధాన్యం కొనుగోలు చెల్లింపులకు రూ.1,674 కోట్లు ఈ ప్రభుత్వమే చెల్లించింది.
మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమం
2025-26 ఆర్థిక సంవత్సరానికి మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖకు రూ.4,332 కోట్ల కేటాయింపును ప్రతిపాదించారు. వృద్ధుల సంరక్షణ కోసం కొత్తగా 12 వృద్ధాశ్రమాలు. స్వయం సహాయక సంఘాల పనితీరుకు సంబంధించి దిద్దుబాటు చర్యలు చేపట్టనున్నారు.
పాఠశాల విద్య రూ.31,805 కోట్లు..
2025-26 ఆర్థిక సంవత్సరానికి పాఠశాల విద్యాశాఖకు రూ.31,805 కోట్ల కేటాయింపును ప్రతిపాదించారు. ఇందులో భాగంగా 2025-26 విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకం క్రింద రూ.15,000 ఆర్థిక సహాయంను అందించనున్నారు. రిజల్ట్ ఓరియెంటెడ్ ఎడ్యుకేషన్ పై దృష్టి సారించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి టెక్నాలజీ విషయాలను ప్రధాన పాఠ్యాంశాలుగా తీసుకురావడానికి కృషి. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర పథకం ద్వారా 35.69 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫాంలు.. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం.
ఉన్నత విద్య..
2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఉన్నత విద్యాశాఖకు 2,506 కోట్ల రూపాయల కేటాయించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ 100 విశ్వవిద్యాలయాలలో మన రాష్ట్ర విశ్వ విద్యాలయాలను నిలపడమే ప్రభుత్వ లక్ష్యం. మల్టీ డిసిప్లినరీ విద్య మరియు పరిశోధన విశ్వ విద్యాలయాల స్థాపన, పాలిటెక్నిక్ విద్యలో క్రెడిట్ ఆధారిత వ్యవస్థను ప్రవేశపెట్టడం, అధునాతన తరగతి గదులు, ప్రయోగశాలలు, డిజిటల్ లైబ్రరీలతో విద్యాలయాలను ఆధునీకరించడం వంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంది.
ఆరోగ్య రంగం..
కీలకమైన వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు రూ.19,264 కోట్ల కేటాయింపును ప్రతిపాదించారు. ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల రూపాయల ఆరోగ్య బీమా పథకం అందుబాటులోకి తీసుకురానున్నారు. వైద్య రంగంలో దాదాపు రూ.6,400 కోట్ల బకాయిలు ఉన్నాయి. వాటిలో రూ.1,624 కోట్లు తిరిగి చెల్లించారు.
పర్యాటకం, క్రీడలు
2025-26 ఆర్థిక సంవత్సరానికి యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖకు రూ.469 కోట్లను కేటాయించారు. 'ఆంధ్రప్రదేశ్ పర్యాటక విధానం 2024-29' ద్వారా పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించారు. 'ఆంధ్రప్రదేశ్ క్రీడా విధానం 2024-29' ద్వారా మెరుగైన క్రీడా సంస్కృతిని పెంపొందించడానికి, క్రీడా నైపుణ్యాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు ప్రకటించింది.