ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఆయన ఏ4గా ఉన్నారు. ఇప్పటికే మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. మిథున్‌రెడ్డి విచారణ నేపథ్యంలో సిట్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మిథున్‌రెడ్డి ఏ క్షణమైనా అరెస్టయ్యే అవకాశం కనిపిస్తోంది. హైకోర్టు, సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టేయడంతో ఆయనపై అరెస్టు వారంట్ జారీ కోసం సిట్ అధికారులు శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టులో మెమో వేశారు. అయితే ఏసీబీ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీకి నిరాకరించింది. హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలకు సంబంధించిన వివరాల్ని అందించాలని సూచించింది. దాంతో సిట్ తీర్పులను మెమోకు జత చేసింది.
మరోవైపు గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పని చేసిన నారాయణ స్వామి సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21న ఉదయం 10 గంటలకు విచారణకు రావాలంటూ నోటీసుల్లో స్పష్టం చేసింది. కాగా లిక్కర్ స్కామ్‌లో మొత్తం 49మందిని సిట్ నిందితులుగా చేర్చింది. ఏ1గా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఏ2 దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డి, ఏ3గా దొడ్డ వెంకట సత్యప్రసాద్, ఏ4గా మిథున్ రెడ్డి, ఏ5 మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి, ఏ6 సజ్జల శ్రీధర్ రెడ్డి, సహా పలువురిని నిందితులుగా చేర్చింది.