ఏపీ పర్యటన చాలా ఆనందాన్నిచ్చిందని ఎక్స్‌లో ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. రాష్ట్ర పర్యటన ముగించుకుని తిరిగి ఢిల్లీ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా కనెక్టివిటీని పెంచే కార్యక్రమంలో పాల్గొనడం గర్వకారణంమన్నారు. పరిశ్రమలను అభివృద్ధి చేసి ప్రజలను శక్తిమంతులు చేసేలా చాలా ప్రాజెక్టులు మంజూరు చేశామని తెలిపారు. ‘‘శ్రీశైలం క్షేత్రంలో ఉండటం అపారమైన ఆనందాన్ని ఇస్తుంది. ఈ పవిత్ర స్థలంలో అడుగడుగున దైవత్వం నిండి ఉంది. ఇక్కడి ప్రజల సాదర స్వాగతానికి నేను కృతజ్ఞుడిని. శ్రీ భ్రమరాంబికా దేవి, మల్లికార్జున స్వామి వార్లు ఎల్లప్పుడూ దేశాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.’ అని పేర్కొన్నారు.
ప్రధాని మోడీ ఈ రోజు కర్నూలు జిల్లాలో పర్యటించారు. పలు ప్రాజెక్టులకు వర్చువల్ గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రెండు ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. నన్నూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై ప్రసంగించారు. అనంతరం తిరిగి ఢిల్లికి బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ప్రధాని మోడీ స్పందించారు. భారత్‌ను 21వ శతాబ్దపు తయారీ కేంద్రంగా ప్రపంచం చూస్తోంది. ఆత్మనిర్భర్ భారత్ సాధనకు ఆంధ్రప్రదేశ్ కీలకంగా మారనుందని ప్రధాని అన్నారు.
ప్రధాని కర్మయోగి: పవన్
ఎలాంటి ఫలితాలు ఆశించకుండా కేవలం దేశ సేవే పరమావధిగా పని చేస్తున్న ప్రధాన నరేంద్ర మోడీని మనం కర్మయోగిగా చూస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ‘సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్’ బహిరంగ ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. మోదీ దేశాన్ని మాత్రమే కాదని, రెండు తరాలను నడుపుతున్నారని తెలిపారు. ప్రపంచమంతా దేశం వైపు తలెత్తి చూసే విధంగా ఆత్మనిర్భర్ భారత్ తీసుకొచ్చారని కొనియాడారు. ఒక తరం కోసం ఆలోచించే నాయకుడు చంద్రబాబు అంటూ ప్రశంసించారు. కూటమి 15 ఏళ్లకు తక్కువ కాకుండా బలంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ సహా పలువురు మంత్రులు, ప్రముఖులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల నిర్మించిన, నిర్మించబోతున్న రూ.13,429 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.