AP Cinema Tickets : ఏపీలో కొలిక్కి వచ్చిన సినిమా టికెట్‌ ధరల వ్యవహారం

AP Cinema Tickets : ఏపీలో సినిమా టికెట్‌ ధరలపై త్వరలో జీవో వచ్చే అవకాశం కనిపిస్తోంది. థియేటర్లలో మూడు శ్లాబుల్లో టికెట్ల ధరలు ఉండనున్నాయి.

Update: 2022-02-18 03:00 GMT

AP Cinema Tickets : ఏపీలో సినిమా టికెట్‌ ధరలపై త్వరలో జీవో వచ్చే అవకాశం కనిపిస్తోంది. థియేటర్లలో మూడు శ్లాబుల్లో టికెట్ల ధరలు ఉండనున్నాయి. సినిమా టికెట్ల ధరలపై రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని 13 మంది సభ్యులతో ఏర్పాటైన కమిటీ సచివాలయంలో సమావేశమై కీలక అంశాలపై చర్చించింది.

నివేదికను సిద్ధం చేసింది. రెండు రోజుల్లో సీఎంకు ఆ నివేదికను ఇవ్వాలని నిర్ణయించింది. సర్కార్‌ నిర్ణయం తర్వాత టికెట్‌ రేట్లును నిర్ధారిస్తూ జీవోలు జారీ కానున్నాయి. త్వరలో కొన్ని పెద్ద సినిమాల రిలీజ్‌ ఉన్నందున టికెట్‌ రేట్లపై వెంటనే తుది నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడింది.

అందరికీ సంతృప్తికరంగా ప్రభుత్వం మరో వారం, పది రోజుల్లో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వెల్లడించారు కమిటీ సభ్యులు. తాము అడిగిన రేట్లు ఇచ్చేందుకు అధికారులు సానుకూలంగా స్పందించారని చెప్పారు తెలుగు ఫిలిం ఛాంబర్‌ సభ్యులు. గ్రామాల్లో ఉండే మల్టీప్లెక్స్‌ టిక్కెట్ల రేట్లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని థియేటర్లలో టికెట్ల ధరల్లో వ్యత్యాసం ఉంటుందన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో కనీస ధర 40కి దగ్గరగా, పట్టణాల్లో 70కి దగ్గర ఉండే అవకాశం ఉందని చెప్పారు. వంద కోట్ల పైబడిన బడ్జెట్‌తో తీసిన సినిమాలను ప్రత్యేకంగా పరిగణించే అంశంపైనా చర్చించినట్లు తెలిపారు. హాళ్లలో తినుబండారాల ధరలు టికెట్ల కంటే అధికంగా ఉంటున్నాయన్న అంశంపైనా చర్చించామన్నారు.

చిన్న సినిమాల ప్రదర్శనకు థియేటర్ల లభ్యత, ఐదో ఆట ప్రదర్శన తదితర అంశాలపై చర్చ జరిగిందన్నారు. త్వరలో సమస్యలన్నీ తొలగిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News