AP Municipal Elections : ఏపీలో ముగిసిన మున్సిపల్‌, కార్పొరేషన్ల ఎన్నికలు

AP Municipal Elections : ఏపీలో మున్సిపల్‌ ఎన్నికలు ముగిశాయి.. కానీ, అవి ప్రజాస్వామ్య బద్దంగా జరిగిన దాఖలాలు ఒక్కటీ కనిపించలేదు..

Update: 2021-11-15 13:48 GMT

AP Municipal Elections : ఏపీలో మున్సిపల్‌ ఎన్నికలు ముగిశాయి.. కానీ, అవి ప్రజాస్వామ్య బద్దంగా జరిగిన దాఖలాలు ఒక్కటీ కనిపించలేదు.. ఎలాగైనా గెలవాలనే ఆరాటంతో కుదిరితే దౌర్జన్యాలు, కుదరకపోతే దాడులకు తెగబడింది అధికార వైసీపీ.. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో కనిపించిన దారుణాలు ఒక లెక్క అయితే.. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లో లెక్కలేనన్ని అరాచకాలు వెలుగు చూశాయి..

అడుగడుగునా అరాచకం.. అధికార పార్టీలో ఉన్నామని ధైర్యం.. ఎవరేం చేస్తారులే అనే బరితెగింపు.. కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లో ఎన్ని అరాచకాలు సృష్టించాలో అన్నీ చేశాయి అధికార వైసీపీ శ్రేణులు.. ఓట్లు కొనడం కాదు.. ఏకంగా దొంగ ఓటర్లనే రప్పించి రచ్చ రచ్చ చేశారు వైసీపీ నేతలు. ఇక్కడా అక్కడా అని లేదు.. కుప్పం మొత్తం దొంగ ఓటర్లతో నింపేశారు.. మొత్తం ఎన్నికల ప్రక్రియనే ఒక ఫార్స్‌గా మార్చేశారు.. ప్రజాస్వామ్యబద్దంగా జరగాల్సిన పోలింగ్‌ను అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు నవ్వులపాలు చేశారు. దొంగ ఓటర్లతో దొడ్డిదారిన కుప్పం మున్సిపాలిటీని చేజిక్కించుకునేందుకు ఉదయం నుంచి చేయని ప్రయత్నాలు లేవు.. ప్రశ్నించిన టీడీపీ నేతలపై ఎదురు దాడులకు తెగడబడ్డారు.. అటు పోలీసులు కూడా అధికార పార్టీ అక్రమాలను ప్రశ్నించకుండా టీడీపీ నేతలపైనే విరుచుకుపడ్డారు.. పోలింగ్‌ మొదలయ్యే ముందు నుంచి ముగిసే వరకు రోజంతా కప్పంలో ఉద్రిక్త వాతావరణం కనిపించింది..

కుప్పంలోని విజయవాణి స్కూల్‌ దగ్గర రోజంతా టెన్షన్‌ వాతావరణం కనిపించింది.. విజయవాణి స్కూల్‌లో పెద్ద సంఖ్యలో దొంగ ఓటర్లు ఉన్నారన్న సమాచారంతో టీడీపీ శ్రేణులు అక్కడికొచ్చాయి.. మహిళా దొంగ ఓటర్లను స్కూల్‌లోనే బంధించారు టీడీపీ కార్యకర్తలు.. మొదట వారిని వివరాలు అడిగితే సమాధానం చెప్పలేదు.. దీంతో వారితో గొడవకు దిగారు టీడీపీ కార్యకర్తలు.. టీడీపీ శ్రేణులు వచ్చిన కొద్దిసేపటికి అక్కడికి పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. దొంగ ఓటర్లను వదిలిపెట్టి టీడీపీ శ్రేణులపై విరుచుకుపడ్డారు.. లాఠీలతో తరిమి కొట్టారు.. అయితే, దొంగఓట్లు వేసేందుకు వచ్చిన మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకోకపోవటంపై టీడీపీ శ్రేణులు మండిపడ్డాయి.

విజయవాణి స్కూల్‌ దగ్గర జరిగిన లాఠీఛార్జ్‌లో వి.కోట మండలానికి చెందిన నవీన్‌ కుమార్‌ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.. ఆయన తలకు దెబ్బ తగలడంతో స్పృహ కోల్పోయాడు.. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు టీడీపీ కార్యకర్తలు.. పోలీసుల తీరుపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. దొంగ ఓట్లు వేసే వారిని వదిలేసి మమ్మల్ని కొడతారా అంటూ ఫైరవుతున్నారు.. ప్రశ్నించిన వారిని ఎవరినీ వదలకుండా పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలిస్తున్నారు.

రాత్రి నుంచి కుప్పం మున్సిపల్ పరిధిలోనే మకాం వేసిన దొంగ ఓటర్లు.. విడతల వారీగా పోలింగ్‌ కేంద్రాల్లోకి ప్రవేశించి ఓట్లేశారు.. అయితే, కొన్నిచోట్ల దొంగ ఓటు వేసేందుకు ప్రయత్నించిన యువకులను టీడీపీ కార్యకర్తలు పట్టుకున్నారు. 18వ వార్డులో దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నించిన వారిని టీడీపీ ఏజెంట్లు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 16వ వార్డులోనూ దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన వారిని టీడీపీ శ్రేణులు వెంటాడాయి. పుంగనూరు నుంచి పెద్ద ఎత్తున దొంగ ఓటర్లు వచ్చినట్టు టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.

తమిళనాడు నుంచి వచ్చిన 60 మంది దొంగ ఓటర్లను పూల మార్కెట్‌ దగ్గర టీడీపీ కార్యకర్తలు గుర్తించారు. బస్సు టైర్లలో గాలి తీసి దొంగ ఓటర్లను పోలీసులకు పట్టించారు. ఐతే.. దొంగ ఓటర్లను పట్టుకున్న టీడీపీ కార్యకర్తలపైనే పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. పోలీసుల తీరుపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి దొంగ ఓట్లు వేస్తున్నవారిని పట్టుకుంటే.. ఊరి చివర వదిలేయడమేంటని పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

గతంలో ఎన్నడూ చూడనటువంటి పోకడలు, వింతలను కుప్పం ఓటర్లు చూడాల్సి వచ్చింది. క్యూలైన్లలో నిల్చున్న కుప్పం ఓటర్లకు కొత్త ముఖాలు కనిపించాయి.. టీడీపీ కార్యకర్తలు ఒక్కో దొంగ ఓటరును జల్లెడపట్టి బయటకు లాగుతుంటే.. కుప్పం ఓటర్లు ఆశ్చర్యంగా చూసిన పరిస్థితి.. దశాబ్దాలుగా ఓ ప్రశాంత వాతావరణంలో ఓటు వేసిన అనుభవం ఉన్న కుప్పం ఓటర్లకు ఈ పరిణామాలు ఒకింత షాకింగ్‌గా ఉన్నాయి. గతంలో ఎన్నడూ ఇంత మంది దొంగ ఓటర్లను చూడలేదంటున్నారు. బస్సుల్లో, కార్లలో, ఇతర వాహనాల్లో వందలకు వందల మంది దొంగ ఓటర్లను దింపి, ఇలా ఓట్లు వేయించడం ఎన్నడూ చూడలేదని చెబుతున్నారు.

Tags:    

Similar News