AP : రాయలసీమను రతనాలసీమగా మార్చడమే నా లక్ష్యం - చంద్రబాబు

Update: 2025-08-30 11:48 GMT

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాయలసీమను రతనాలసీమగా మార్చే బాధ్యత తనదని మరోసారి స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో సాగునీటి ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం చేశారని ఆయన విమర్శించారు. కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా పరమసముద్రం వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి, అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

వైసీపీ పాలనపై విమర్శలు

2014-2019 మధ్య కాలంలో రాయలసీమ ప్రాజెక్టులకు రూ.12,500 కోట్లు ఖర్చు చేసినట్లు చంద్రబాబు తెలిపారు. అయితే వైసీపీ ప్రభుత్వం కేవలం రూ.2 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని ఆరోపించారు. కృష్ణా జలాలపై గత ప్రభుత్వం నాటకాలు ఆడిందని, విమానం ఎక్కేలోపే నీళ్లన్నీ ఇంకిపోయిన పరిస్థితులు చూశామని ఆయన ఎద్దేవా చేశారు. "అసత్యాలు చెప్పడంలో వైసీపీ దిట్ట" అని ఆయన అన్నారు. ప్రస్తుతం కృష్ణా జలాలు వస్తున్నందున వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు.

సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి

ప్రతి చెరువుకు నీళ్లిచ్చే బాధ్యత తనది అని చంద్రబాబు ప్రకటించారు. మల్యాల నుండి కుప్పం పరమసముద్రం వరకు నీళ్లు తీసుకొచ్చామని, 27 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా నీళ్లను తరలిస్తున్నామని తెలిపారు. గతంలో రాయలసీమలో కరవు వచ్చినప్పుడు రైలులో నీళ్లు తెప్పించి పశువులను కాపాడామని గుర్తు చేసుకున్నారు. తాను ఏ పని చేసినా దైవంపై భారం వేసి ముందుకు సాగుతానని, పవిత్ర సంకల్పం ఉంటే ఏ పనైనా జయప్రదమవుతుందని చెప్పారు.

కృష్ణా జలాల తరలింపు, భవిష్యత్తు ప్రణాళికలు

కృష్ణా జలాలను 730 కిలోమీటర్లు తరలించిన ఘనత తెలుగుదేశం పార్టీదని చంద్రబాబు అన్నారు. పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో 110 చెరువులకు నీళ్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. కుప్పంలో ఉన్న 520 చెరువులకు చెక్‌డ్యామ్‌ల ద్వారా నీళ్లిచ్చే అవకాశం ఉందని చెప్పారు. హంద్రీనీవా ఫేజ్-1, ఫేజ్-2 ప్రాజెక్టుల ద్వారా 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందుబాటులోకి వస్తుందని, పరిశ్రమలకు కూడా నీళ్లు వస్తాయని తెలిపారు. రాబోయే ఏడాదిలో హంద్రీనీవా ద్వారా చిత్తూరు జిల్లాకు కూడా నీళ్లు అందిస్తానని హామీ ఇచ్చారు. "ముఠా రాజకీయాలు లేకుండా చేసిన పార్టీ తెలుగుదేశం" అని ఆయన అన్నారు

Tags:    

Similar News