Narra Lokesh : ముఖ్యమంత్రి పదవికి అంత తొందరేముంది ?

ముఖ్యమంత్రి పదవికి అంత తొందరేముంది ? చంద్రబాబు యంగ్ అండ్ డైనమిక్ నాయకులు, ఆయన ఇంకా యువ నాయకుడే అని తన స్పష్టమైన అభిప్రాయాన్ని వెల్లడించిన నారా లోకేష్.;

Update: 2025-05-27 10:39 GMT

కడపలో మీడియాతో నారా లోకేష్ చిట్ చాట్ లో తదుపరి సీఎం మీరేగా అని మీడియా అడిగిన ప్రశ్నకు లోకేష్ సమాధానంగా ముఖ్యమంత్రి పదవికి అంత తొందరేముంది ? చంద్రబాబు యంగ్ అండ్ డైనమిక్ నాయకులు, ఆయన ఇంకా యువ నాయకుడే అని తన స్పష్టమైన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ప్రజలకు సేవ చేయడానికి పదవులతో సంబంధం లేదని, ప్రస్తుతం తన దృష్టి అంతా రాష్ట్ర అభివృద్ధి, పార్టీ బలోపేతంపైనే ఉందని లోకేష్ తేల్చిచెప్పారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమైనప్పుడే వాస్తవ సమస్యలు తెలుస్తాయని, వీరయ్య చౌదరి కుటుంబాన్ని పరామర్శించినప్పుడు పొగాకు రైతుల ఇబ్బందులు తన దృష్టికి రాగానే, తక్షణం అధికార యంత్రాంగాన్ని, మంత్రుల బృందాన్ని అప్రమత్తం చేసినట్లు వివరించారు. "పార్టీకి నిరంతర ఫీడ్‌బ్యాక్ అత్యవసరం. మండల స్థాయి నుంచి పొలిట్ బ్యూరో వరకు ‘వర్కింగ్ గ్రూప్ ఫార్ములా’ను అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నాం. ఇది క్షేత్రస్థాయి వాస్తవాలను అర్థం చేసుకోవడానికి ఎంతగానో దోహదపడుతుంది" అని ఆయన అభిప్రాయపడ్డారు.

విద్యా రంగంలో చేపట్టిన సంస్కరణలపై మాట్లాడుతూ, "దేశంలో ఎక్కడా లేని విధంగా 9,000 పైగా పాఠశాలల్లో ప్రతి తరగతికి ఒక టీచర్ విధానాన్ని తీసుకొస్తున్నాం. నేను విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒక్క పాఠశాలనూ మూసివేయలేదు" అని లోకేష్ గర్వంగా తెలిపారు. అలాగే, విశాఖలో 5 లక్షల ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడించారు.

వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన లోకేష్, "మద్యం కుంభకోణంలో జగన్ వైఖరి దొంగే.. దొంగా అన్నట్లుంది" అని ఎద్దేవా చేశారు. "రాష్ట్రం నుంచి పరిశ్రమలు పారిపోయే పరిస్థితి ఇప్పుడు లేదు, ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు లేదు" అని చురక అంటించారు. ఉరసా సంస్థకు 99 పైసలకు ఎకరం భూమి ఇచ్చినట్లు జగన్ నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు. "టీసీఎస్‌కు 99 పైసలకు భూమి ఇచ్చాం, కానీ ఉరసాకు మార్కెట్ ధరకే ఇచ్చాము" అని ఆయన స్పష్టం చేశారు.

పార్టీ సంస్థాగతంగా బలంగా ఉండాలని ఆకాంక్షించిన లోకేష్, "క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసిన వారికి పదవులు ఇవ్వడం వల్లే మహానాడుకు కొత్త ఊపు వచ్చింది. కార్యకర్తల్లో కసి కనిపిస్తోంది. పార్టీ నాకు ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తిస్తాను. పదవుల కోసం నేతలు అలగడం మాని, పార్టీ కోసం కష్టపడాలి. సరైన సమయంలో అవే వస్తాయి" అని హితవు పలికారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని వైసీపీ నేతలు కళ్లు తెరిచి చూడాలని సూచించారు.

ఇటీవల ప్రధానమంత్రి మోదీతో జరిగిన సమావేశం గురించి ప్రస్తావిస్తూ, 20 ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు ఇవ్వడం ఆయన గొప్పతనమని, యువ నాయకులతో ఆయన జరిపిన చర్చలు ఎంతో ప్రేరణనిచ్చాయని లోకేష్ కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధి, పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రథమ కర్తవ్యమని ఆయన పునరుద్ఘాటించారు.

Tags:    

Similar News