మంత్రి నారా లోకేష్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. వైసీపీ పాలనలో ఉన్నప్పుడు కొందరు మాజీ మంత్రులు, నేతలు తండ్రి చంద్రబాబు నాయుడు గారిని అవమానించారని, అలాగే అందరికీ తల్లిలాంటి భువనేశ్వరి గారిపై కూడా తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారని లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా లాంటి వాళ్లు ఇష్టం వచ్చినట్టు తిట్టారు. వాళ్లను వదిలిపెట్టేదే లేదని నారా లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. “ఆ సమయంలో ఎవరు ఏం మాట్లాడారో నాకు బాగా తెలుసు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా లాంటి వాళ్లు ఇష్టం వచ్చినట్టుగా తిట్టారు. వాళ్లను ఎలా వదిలిపెడతాం అన్నారు.
వారి ప్రవర్తనకు తగిన సమాధానం తప్పక ఇస్తాను” అని ఘాటుగా వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం ఎవరినీ టార్గెట్ చేయదన్నారు. కానీ తప్పు చేసిన వారిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు లోకేష్. వైసీపీ నేతల తీరుతో బాధపడ్డ టిడిపి కార్యకర్తలకు కచ్చితంగా న్యాయం చేస్తానన్నారు. ఏ నమ్మకంతో వైసీపీ అరాచకాలకు భయపడకుండా టీడీపీ జెండా మోశారో.. వారి నమ్మకాన్ని కచ్చితంగా కాపాడుకుంటాం అన్నారు లోకేష్. తప్పులు చేసి తప్పించుకోవాలని చూస్తే ఎవరినీ విడిచిపెట్టబోమన్నారు.
అలాగే టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ఆడవారి జోలికి అస్సలు వెళ్లొద్దని.. వెళ్తే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయన్నారు లోకేష్. ఇప్పటికే అలా చేసిన వారికి ఎలాంటి శిక్షలు పడుతున్నాయో చూసి జాగ్రత్తగా ఉండాలన్నారు. పార్టీకి చెడ్డపేరు తీసుకొచ్చేలా ఎవరు ప్రవర్తించినా శిక్షలు కఠినంగానే ఉంటాయన్నారు. జగన్ మోహన్ రెడ్డిలాగా తప్పులు చేస్తే వెనకేసుకురావడం ఉండదని.. కఠినంగానే వ్యవహరిస్తామన్నారు. ఎంత పార్టీ కోసం పనిచేసినా.. ఆడవారిని అవమానిస్తే చంద్రబాబు నాయుడు ఊరుకోరని.. తాను కూడా అలాంటి బాటలోనే నడుస్తానన్నారు. దీంతో లోకేష్ వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.