LOKESH: యువగళం యాత్రతో కొత్త జోష్‌

తెలుగుదేశం పార్టీలో నూతనోత్తేజం... లోకేశ్‌ యాత్రలో భారీగా పాల్గొంటున్న ప్రజలు

Update: 2023-11-28 01:30 GMT

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పునఃప్రారంభంతో తెలుగుదేశం పార్టీలో కొత్త జోష్‌ కనిపిస్తోంది. జనసైనికులూ పాదయాత్రలో మమేకం అవుతున్నారు. నేడు ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గంలోకి లోకేష్‌ ప్రవేశించనున్నారు. 79రోజుల సుదీర్ఘ విరామానంతరం యువగళం పాదయాత్రను పునఃప్రారంభించిన లోకేష్‌కు కోనసీమ ప్రజలు హారతులు పట్టారు. 210వ రోజు యాత్ర పొదలాడ నుంచి ప్రారంభంకాగా తాటిపాక బహిరంగ జనం పోటెత్తారు. బోడసకుర్రు- పాసర్లపూడి వంతెనపై జనసేన కార్యకర్తలు లోకేష్‌కు ఎదురేగి స్వాగతం పలికారు. బ్రిడ్జి పొడవునా టీడీపీ, జనసేన జెండాలు రెపరెపలాడాయి.


పి.గన్నవరం నియోజకవర్గం అప్పనపల్లి రైతులు లోకేష్‌ను కలిశారు. అప్పనపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఏడాదిలో పూర్తిచేస్తానని నమ్మంచిన జగన్‌... తన పదవీ కాలం పూర్తికావస్తున్నా చేయలేదన్నారు. అధికారంలోకి వచ్చాక అప్పనపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తిచేసి సమస్య పరిష్కరిస్తామని లోకేష్‌ వారికి హామీ ఇచ్చారు. లోకేష్ పాదయాత్రకు సంఘీభావం తెలిపిన టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్‌లు ప్రజల స్పందనపై హర్షం వ్యక్తంచేశారు. రాత్రి పేరూరు క్యాంప్‌ సైట్‌లో బస చేసిన లోకేష్‌........ 211వ రోజు అక్కడి నుంచే కొనసాగిస్తారు. ఆక్వా రైతులతో భేటీ అనంతరం..అమలాపురం హైస్కూలు సెంటర్ లో బీసీలతో సమావేశం అవుతారు. ముమ్మడివరం ఉమెన్స్ కాలేజి వద్ద విడిది కేంద్రంలో రాత్రికి బస చేయనున్నారు.


జగన్ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడుతున్నారనటానికి యువగళం పున:ప్రారంభం సందర్భంగా వచ్చిన ప్రజాస్పందనే నిదర్శనమని తెలుగుదేశం-జనసేన నేతలు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను జగన్ ఎందుకు ధ్వేషిస్తోందో ప్రజలు వందలాది సంఘటనలు చెబుతున్నారని నేతలు తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం-జనసేన కూటమి విజయం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు.

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్రకు మద్దతుగా వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు, పార్టీ నేతలు యాత్రలో పాల్గొంటున్నారు. కోనసీమ జిల్లా అంబాజీపేట నుంచి తెదేపా, జనసేన నేతలు తరలివెళ్లారు. వెంకటరాజు ఆయిల్‌ మిల్‌ నుంచి బైక్‌ ర్యాలీ చేపట్టారు. తర్వాత రాజోలు ప్రాంతానికి బయలుదేరి వెళ్లారు. పి.గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో యువగళం పాదయాత్రను విజయవంతం చేయాలని ఇరుపార్టీల నేతలు నిర్ణయించారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం నుంచి టీడీపీ, జనసేన శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లాయి. దెందులూరు, పెదవేగి, పెదపాడు, ఏలూరు గ్రామీణ మండలాలకు చెందిన నాయకులు యువగళం యాత్రలో పాల్గొన్నారు.

Tags:    

Similar News