AP: టీడీపీలోకి భారీగా వైసీపీ నేతల వలసలు
సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్న కూటమి అభ్యర్థులు;
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అభ్యర్థులు ఓట్ల వేటలో నిమగ్నమయ్యారు. ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకర్షించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కూటమి అభ్యర్థులు సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ... ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మరోవైపు వైసీపీని వీడి చాలామంది తెలుగుదేశం, జనసేన, బీజేపీ గూటికి చేరుతున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ పాలకమండలి మాజీ ఛైర్మన్, వైసీపీ నేత పైలా సోమి నాయుడు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి కండువా కప్పి... పార్టీలోకి ఆహ్వానించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం నేత M.S. బేగ్ ఆయన నివాసంలో కూటమి నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని, ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరితో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. బాపట్ల జిల్లా చీరాలలోని మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ సముదాయంలో కూటమి అభ్యర్థి M.M.కొండయ్య ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు సూపర్ సిక్స్ పథకాలను వివరించారు.
కర్నూలు జిల్లా కౌతాళం మండలం మేలిగనూరులో కూటమి ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు, ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి ప్రచారం నిర్వహించారు. వైఎస్‌ఆర్ జిల్లా జమ్మలమడుగులో పెద్దముడియం మండలానికి చెందిన కూటమి కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు అసెంబ్లీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి, కడప ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి పాల్గొన్నారు. శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలం తవలం పంచాయతీ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన వైసీపీ నేతలు తెలుగుదేశంలో చేరారు. కూటమి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ కండువా కప్పి... వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో వైసీపీ నాయకులు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. ఉమ్మడి జిల్లా కుమ్మరి శాలివాహన సంఘం అధ్యక్షుడు, రాష్ట్ర కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ సహా పలువురు నేతలు పార్టీలో చేరారు. వీరందరికీ పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చంద్రబాబు కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు. విశాఖ జిల్లా పద్మనాభం మండలం అయినాడలో కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన లభించింది. గంటాకు భారీ గజమాలతో స్వాగతం పలికి... అడుగడుగునా పూలవర్షం కురిపించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం ధర్మపురంలో ఎమ్మెల్యే బెందాళం అశోక్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజలకు సూపర్ సిక్స్ పథకా ల గురించి వివరించారు. శ్రీకాకుళంలో ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయడు... ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్‌తో కలిసి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లిన రామ్మోహన్ నాయుడికి మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. ప్రజలకు సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించిన ఎంపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.