పోలీసుల ఆంక్షలు.. రాత్రి 8 గంటల వరకే వైన్ షాప్స్
ప్రభుత్వ నిబంధనల ప్రకారం మద్యం దుకాణాలు రాత్రి 8 గంటల వరకు, బార్లు రాత్రి 11 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయి;
కరోనా కొత్త వేరియంట్ స్ట్రెయిన్ వైరస్ కలవరపెడుతుండటంతో... విశాఖలోనూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌పై పోలీసులు ఆంక్షలు విధించారు. ప్రతి ఏటా కొత్త ఏడాదిని స్వాగతిస్తూ.. విశాఖ బీచ్ రోడ్డు లో పండుగ వాతవరణం నెలకొంటుంది. హోటళ్లు, ఫంక్షన్‌హాళ్లలో ప్రత్యేక కార్యక్రమాలు, బీచ్ రోడ్డులో యువత సందడి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ సంవత్సరం కొవిడ్ నేపథ్యంలో వీటికి అనుమతులు ఇవ్వడం లేదని పోలీసులు స్పష్టంచేశారు. కొత్త ఏడాది వేడుకలు జరుపుకునేందుకు ఈసారి అనుమతి ఇవ్వడం లేదని నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా పేర్కొన్నారు.
ప్రజలంతా ఇళ్లలోనే వేడుకలు జరుపుకోవాలని సీపీ సూచించారు. హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లలో డ్యాన్సులు వంటివి నిషిద్ధమన్నారు. న్యూ ఇయర్ సందర్భంగా రోడ్లపై కేక్‌లు కట్ చేసి వాహనాలకు ఇబ్బంది కలిగించినా, ఎక్కువమంది గుమికూడినా, శుభాకాంక్షలు పేరుతో మహిళలను వేధించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మద్యం సేవించి రోడ్లపై అరవడం, అల్లర్లకు పాల్పడటం, ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించడం వంటివి చేస్తే అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు. మద్యం సేవించి వాహనాలను నడపడం, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటి ఉల్లంఘనలకు పాల్పడితే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం మద్యం దుకాణాలు రాత్రి 8 గంటల వరకు, బార్లు రాత్రి 11 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయి. ఆయాచోట్ల కొవిడ్ నిబంధనల ప్రకారం వినియోగదారులను అనుమతించడం, మద్యం అమ్మకాలుంటాయి. 21 ఏళ్లలోపు వారికి మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రార్థనా మందిరాల్లో కూడా కొవిడ్ నిబంధనలను కచ్చితంగా అమలుచేయబోతున్నారు. బీచ్‌రోడ్డులోకి వాహనాలకు, సందర్శకులకు అనుమతి లేదంటున్నారు పోలీసులు.
న్యూ ఇయర్ వేడుకలను పోలీసులు బ్యాన్ చేయడంతో.. యువతలో నిరుత్సాహం ఏర్పడింది. ప్రతి ఏటా థర్టీ ఫస్ట్ నైట్‌ను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నవారు.. ఈఏడాది ఉసూరుమంటున్నారు. సెలబ్రేషన్స్‌పై పోలీసులు ఆంక్షలు విధించడంతో.. గ్రీటింగ్స్ షాప్స్ కూడా వెలవెల బోతున్నాయి. న్యూఇయర్ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన అన్ని వ్యాపారాలపైనా.. ఆంక్షలు ప్రభావం చూపుడుతన్నాయి. అందరూ ఇళ్లోనే వేడుకలు జరుపుకోవాలిన పోలీసులు సూచించడంతో.. నిబంధనలు పాటించకతప్పదని విశాఖ వాసులు అంటున్నారు.