PAWAN: మనసున్న నేత పవన్.. "జీతం మొత్తం అనాథలకే"
మరోసారి గొప్ప మనసు చాటుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్;
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఇది కదా రాజకీయనాయకుడంటే, ఇది కదా అప్యాయత అంటే అని ప్రపంచానికి చూపాడు. తన వేతనం మొత్తాన్ని అనాథ బిడ్డల సంక్షేమానికి వినియోగించనున్నట్లు ప్రకటించారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన 42 మంది అనాథ పిల్లలకు ఒక్కొక్కరికి రూ.5వేలు చొప్పున రూ.2,10,000 ఆర్థిక సాయాన్ని అందించారు. వేతనంలో మిగిలిన మొత్తాన్ని కూడా వారి బాగోగులు చూసేందుకే ఖర్చు చేస్తానని ప్రకటించారు.
96 ఏళ్ల అభిమానానికి ఫిదా
పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లికి చెందిన 96 ఏళ్ల వృద్ధురాలు పోతుల పేరంటాలుతో పవన్ తన క్యాంపు కార్యాలయంలో భోజనం చేశారు. పవన్ కల్యాణ్ మీద అభిమానంతో గడిచిన ఎన్నికల్లో ఆయన విజయం సాధించాలని కొరుకుని వేగులమ్మ తల్లికి పొర్లు దండాలు పెట్టి, అమ్మవారికి గరగ చేయిస్తానని పేరంటాలు మొక్కుకుంది. అందు కోసం తన పింఛను సొమ్ము నుంచి రూ.2,500 చొప్పున పోగు చేసి రూ.27వేలతో గరగ చేయించి సమర్పించింది. అయితే.. ఆమెకు తనతో కలిసి భోజనం చేయాలని ఉందని తెలుసుకున్న పవన్... ఈ రోజు పేరంటాలును తన క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని కలిసి భోజనం చేశాడు. ఆయనే స్వయంగా అడిగి మరి వడ్డిస్తూ, యోగ క్షేమాలు మాట్లాడుకుంటూ ఆప్యాయంగా ఇద్దరు కలిసి భోజనం చేశారు. ఆపై పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా ఓ చీరను, రూ. లక్ష నగదును పేరంటాలుకు అందించారు. అనంతరం ఫొటోలు దిగి ఇంటి బయటి వరకు వచ్చి ఆమెను సాగనంపారు. దీంతో తను అభిమానించే పవన్ కల్యాణ్‌ను కలవడంపై పేరంటాలు సంతోషంతో కంటతడి పెట్టుకుంది.