PAWAN: టీడీపీతో కలిసే ఎన్నికలకు: పవన్‌కల్యాణ్
చంద్రబాబుతో ములాఖత్ అనంతరం పవన్ స్పష్టీకరణ.... రాష్ట్ర భవిష్యత్తు కోసమే నిర్ణయమని వెల్లడి... రేపటి నుంచే కలిసి పనిచేస్తామన్న జనసేనాని..;
వచ్చే ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం కలిసి పోటీ చేస్తాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో బాలకృష్ణ, లోకేశ్‌తో కలిసి... పవన్ ములాఖత్ అయ్యారు. చంద్రబాబుతో పలు కీలక అంశాలపై నేతలు చర్చలు జరిపారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్... చంద్రబాబు అరెస్ట్ కక్షపూరితమైనదేనని ఖండించారు. వైకాపా దౌర్జన్యాలపై సమష్ఠిగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో జనసేన-తెలుగుదేశం కలిసి రంగంలోకి దిగుతాయని తేల్చి చెప్పారు. దీనికి భాజపా కూడా కలిసివచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై రాజమహేంద్రవరం కారాగారంలో ఉన్న చంద్రబాబుతో... MLA బాలకృష్ణ, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్... ములాఖత్ అయ్యారు. ఇప్పటికే లోకేశ్ తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణితో కలిసి చంద్రబాబును కలుసుకున్నారు. పవన్ కూడా బుధవారం... జైలులో చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. బాలకృష్ణ.. చంద్రబాబును కలిసేందుకు తొలిసారి జైలులోకి వెళ్లారు. అరెస్ట్ అయ్యాక... బాలకృష్ణ, లోకేశ్, పవన్ ముగ్గురూ కలిసి ఒకేసారి చంద్రబాబుతో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. చంద్రబాబుతో భేటీలో తాజా పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణ సహా పలు కీలక అంశాలపై చర్చలు జరిగే అవకాశముంది.
చంద్రబాబును రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో కలుసుకున్న పవన్ కల్యాణ్ ... ఆయన ఆరోగ్యం వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. మీలాంటి వ్యక్తికి ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరంగా ఉందని చంద్రబాబుతో చెప్పినట్లు వెల్లడించారు. తన సంపూర్ణ మద్దతు చంద్రబాబుకు ఉంటుందని ఆయనతో చెప్పినట్లు పవన్ వివరించారు.
జనసేన, తెలుగుదేశం ఉమ్మడి కార్యాచరణపై ఇరుపార్టీల నేతలతో చర్చిస్తామని పవన్ కల్యాణ్ తెలిపారు. రాష్ట్ర దుస్థితిని ప్రధానమంత్రికి, గవర్నర్ కు తెలియజేస్తామన్నారు. ఎన్నికల్లో పోటీ కంటే ముందు రాష్ట్ర ప్రజల్లో భరోసా కల్పించడమే ముఖ్యమని పవన్ స్పష్టం చేశారు.