PAWAN: తల్లికి, చెల్లికి విలువివ్వని వాడు మనకేం చేస్తాడు
సీఎం జగన్‌పై పవన్ తీవ్ర విమర్శలు... మార్పు తెస్తాం.. జగన్‌ను ఇంటికి పంపుతాం అని నినాదం;
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుపడే వరకు తెలుగుదేశం జనసేన మైత్రి కొనసాగాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పునరుద్ఘాటించారు. ఈ పొత్తుకు బీజేపీ పెద్దల ఆశీస్సులు ఉంటాయని యువగళం విజయోత్సవ సభలో ఆకాంక్షించారు. వైసీపీ పాలనలో ఏపీ అంధకారంలో కూరుకుపోయిందన్న పవన్..ఈ పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతను తెలుగుదేశం-జనసేన తీసుకున్నాయని పేర్కొన్నారు. మార్పు తీసుకొస్తామని.. వచ్చే ఎన్నికల్లో జగన్‌ను ఇంటికి పంపిస్తామని పవన్ ధీమా వ్యక్తం చేశారు. పోలిపల్లిలో నిర్వహించిన ‘యువగళం-నవశకం’ సభలో పాల్గొన్న పవన్... జగన్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు.
యువగళం పాదయాత్ర.. జగన్ మాదిరిగా బుగ్గలు నిమిరే యాత్ర కాదని... ప్రజల బాధలు తెలుసుకున్న పాదయాత్రని పవన్ అన్నారు. ఇలాంటి పాదయాత్రల వల్ల చాలా అనుభవాలు ఎదురవుతాయని... ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవచ్చని.. తనకు రాని అవకాశాన్ని లోకేశ్ దిగ్విజయంగా పూర్తి చేయడం ఆనందంగా ఉందని జనసేనాని అన్నారు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు గతంలో ఏపీకి రావాలని ఉవ్విళ్లూరేవాళ్లని.... ఏపీ ఒక మోడల్ స్టేట్ అని అక్కడికి వెళ్లాలని చెప్పేవారని. కానీ, ఇప్పుడు.. ఏపీకి ఎందుకు వెళ్లకూడదో చెబుతున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు చాలా బాధ కలిగిందని.. ఏదో ఆశించి చంద్రబాబుకు మద్దతివ్వలేదని... సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు తనవంతు సాయంగా ఉండాలనే మద్దతిచ్చా అని పవన్ అన్నారు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవంతో జాతీయ స్థాయిలో ఎన్డీఏ పక్షానికి కీలక బాధ్యతలు వహించిన వ్యక్తిని జైల్లో పెట్టడం చాలా బాధ కలిగించిందని పవన్ అన్నారు.
మనకు రాజధాని లేకుండా, సరైన పంపకాల్లేకుండా విభజన జరిగిన కష్ట సమయంలో ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీకు మద్దతిచ్చానని... 2024లో టీడీపీ-జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పవన్ ధీమా వ్యక్తం చేశారు. మార్పు తీసుకొస్తున్నాం.. జగన్‌ను ఇంటికి పంపించేస్తున్నాం. అని నినదించారు. జగన్ 80 మంది ఎమ్మెల్యేలను మారుస్తున్నారని వింటున్నామని.... మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు.. జగన్‌నని పవన్ అన్నారు. ప్రజాస్వామ్యం అనే పదానికి జగన్‌కు విలువ తెలియదన్న పవన్... ఏదైనా మాట్లాడితే దూషిస్తారు.. దాడులు చేస్తారని అన్నారు.
ఇంట్లో ఉన్న తల్లికి, చెల్లికి విలువ ఇవ్వని సీఎం జగన్.. మహిళలకు ఏం విలువ ఇస్తారని పవన్ ప్రశ్నించారు. ఒంటరి మహిళలు అన్యాయాలకు గురవుతున్నారని.. మరోసారి వైసీపీ ప్రభుత్వం వస్తే తనతో సహా అంతా.. వైసీపీ గూండాలను ఎదుర్కోవటానికి కర్రో, కత్తో పట్టుకోవాల్సి వస్తుందని కేంద్రంలోని పెద్దలకు చెప్పానని పవన్ అన్నారు. టీడీపీతో పొత్తు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని కేంద్రానికి వివరించానని తెలిపిన పవన్ ... కేంద్రంలోని బీజేపీ పెద్దల మద్దతు ఉంటుందని ఆశిస్తున్నానని తెలిపారు. పొత్తు సాధ్యమైనంత ఎక్కువకాలం.. ఆంధ్రప్రదేశ్ నిలదొక్కుకునే వరకు ఉండాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు.