PAWAN: అధికారులకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
ఎవరు తప్పు చేసినా సహించేది లేదన్న డిప్యూటీ సీఎం... అవినీతిపై ఫిర్యాదులు వస్తున్నాయన్న పవన్;
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి హామీ పథకం అమలులో క్షేత్ర స్థాయి సిబ్బంది నుంచి డైరెక్టర్ వరకు ఎవరు తప్పు చేసినా సహించేది లేదని ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పవన్‌కల్యాణ్ హెచ్చరించారు. జవాబుదారీతనాన్ని పెంచాల్సిన సోషల్ ఆడిట్ విభాగంలోనూ అవినీతి జరుగుతుందన్న ఫిర్యాదులు వస్తున్నాయని మండిపడ్డారు. ఇలాంటి కీలక విభాగంపైనా నిఘా పెట్టాల్సిన అవసరం ఏర్పడుతోందంటే పరిస్థితులు ఎంత దిగజారాయో అర్థమవుతోందని మంత్రి వ్యాఖ్యానించారు. ఉపాధి పనులకు రాకపోయినా హాజరు వేయడం, పని చేయకుండా చేసినట్లుగా చూపడం, తక్కువ పని చేసి ఎక్కువ చేసినట్లుగా నమోదు చేయడం వంటి అవకతవకలు గమనించామని పవన్ పేర్కొన్నారు.
ఉపాధి హామీ పథకం అమలుపై సచివాలయం నుంచి జిల్లా పరిషత్ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులు, జిల్లా జలయాజమాన్య సంస్థ పథక సంచాలకులు, ఎంపీడీవోలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు. పథక సంచాలకులు కొందరు గ్రామాలకు వెళ్లడం లేదని.. తనిఖీలు చేయడంలేదని పవన్ మండిపడ్డారు. సోషల్ ఆడిట్ సభలకు హాజరు కావడంలేదన్నారు. క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బందిపై పథక సంచాలకులకు నియంత్రణ లేదనే వాస్తవాలు తన దృష్టికి వచ్చాయన్నారు. క్లస్టర్ స్థాయిలో పనిచేసే ఏపీడీలు పని ప్రదేశాలకు వెళ్లడంలేదనే ఫిర్యాదులొస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక మీదట పని తీరు మార్చుకోవాలి. మండల స్థాయిలో పథకం అమలులో పూర్తి బాధ్యత ఎంపీడీవోలదే అని తెలిపారు. మండల స్థాయిలో జరిగే అవకతవకలకు ఎంపీడీవోలే పూర్తి బాధ్యత వహించాలని మంత్రి అన్నారు.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో గ్రామాల్లో చేపట్టబోయే ఉపాధి పనులకు సంబంధించి చేసే ప్రతిపాదనలు, తీర్మానాల కోసం ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో మునుపెన్నడూ లేని విధంగా నిర్వహించే గ్రామ సభల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలన్నారు. రెండు రోజుల ముందుగానే గ్రామాల్లో దండోరా వేయించాలి. పంచాయతీ అధికారులు, సిబ్బందికి గ్రామ సభల నిర్వహణపై అవగాహన కల్పించాలి.పేద కూలీలకు, రైతులకు, గ్రామానికి ఉపయోగపడే పనులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. నాణ్యత విషయంలో రాజీ పడొద్దు’ అని మంత్రి పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు.
పవన్ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామ సభలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఒకేరోజున 13326 పంచాయతీలలో గ్రామసభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈనెల 23న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు జరుగనున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రైల్వే కోడూరులో జరిగే గ్రామసభకు హాజరుకానున్నారు. గ్రామ సభలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఒకే రోజున 13326 పంచాయతీలలో గ్రామసభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈనెల 23న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు జరుగనున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రైల్వేకోడూరులో జరిగే గ్రామసభకు హాజరుకానున్నారు.