Pawan Kalyan: ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు పవన్ ఆర్థిక సాయం..

Pawan Kalyan: కౌలు రైతుల భరోసా యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌... కర్నూలు, నంద్యాల జిల్లాలో పర్యటించారు.

Update: 2022-05-09 01:17 GMT

Pawan Kalyan: కౌలు రైతుల భరోసా యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌... కర్నూలు, నంద్యాల జిల్లాలో పర్యటించారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకొచ్చిన జనసేనాని.. వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. కర్నూలు, నంద్యాల జిల్లాలోని పలు గ్రామాల్లో పర్యటించి.. పలువురు రైతుల కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు లక్ష ఆర్థిక సాయం అందజేశారు.

నంద్యాల జిల్లా వెంకటేశ్వరపురంలో అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్న నాగ సుబ్బరాయుడు కుటుంబాన్ని పవన్‌ కల్యాణ్‌ పరామర్శించారు.. రైతు సుబ్బరాయుడు భార్య భూలక్ష్మికి లక్ష రూపాయల చెక్‌ను అందజేశారు.. అలాగే నూనెపల్లిలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు హుస్సేన్‌ సాహెబ్‌ కుటుంబాన్ని పవన్‌ కల్యాణ్‌ పరామర్శించారు.. కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు.. లక్ష రూపాయల చెక్‌ను ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు.

శిరివెళ్ల మండలం గోవిందపల్లెలో ఆత్మహత్య చేసుకున్న కౌలురైతుల కుటుంబాలను పరామర్శించారు. అక్కడే రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. జగన్‌ ప్రభుత్వం అద్భుత పరిపాలన అందించి ఉంటే.. జనసేన కౌలు భరోసా యాత్ర చేయాల్సి వచ్చేది కాదన్నారు జనసేనాని. తాము సాయం చేస్తుంటే వైసీపీ నాయకులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

కౌలు రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమని పవన్ కల్యాణ్‌ స్పష్టం చేశారు. వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే ఏపీకి అంధకారమేనని హెచ్చరించారు. 151 మంది ఎమ్మెల్యేలున్నారని వీర్రవీగుతున్న వైసీపీకి భవిష్యత్‌లో 15 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదన్నారు.

151 మంది ఎమ్మెల్యేలు ఉంటే రాష్ట్రంలో సమస్యలు పరిష్కరించవచ్చని.. కానీ వారు సంఖ్యాబలం ఉందని దౌర్జన్యంగా మాట్లాడుతున్నారని అన్నారు. వారు ఈ పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. ఆ పార్టీ నేతల బెదిరింపులకు ఎవరూ భయపడే పరిస్థితులేవన్నారు. పవన్‌ కళ్యాణ్‌ కౌలు రైతుల భరోసా యాత్ర ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో జనసేనానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు.

Tags:    

Similar News