ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ గిరిజనులపై తనకున్న ప్రత్యేక ప్రేమను మరోసారి చాటుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలం కురిడి గ్రామస్థుల కోసం తన వ్యవసాయ క్షేత్రంలో పండించిన మామిడి పండ్లను ప్రేమతో పంపించారు. పవన్ కల్యాణ్ ఆదేశాలతో ఆయన సిబ్బంది ప్రత్యేక వాహనంలో మామిడి పండ్లను ఆ గ్రామానికి తీసుకువెళ్లారు. గ్రామంలోని సుమారు 230 గిరిజన కుటుంబాలు ఉండగా.. ప్రతి ఇంటికి అర డజను చొప్పున పండ్లను పంపిణీ చేశారు. డిప్యూటీ సీఎం స్వయంగా పంపిన పండ్లను తీసుకున్న గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు. ‘‘మా పవన్ సార్ పంపిన పండ్లు మాకోసం పండ్లను పంపారు. ఆయన చల్లగా ఉండాలి’’ అని అన్నారు.
ఇటీవల అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా పవన్ కల్యాణ్ కురిడి గ్రామంలో పర్యటించారు. ఆ సమయంలో గ్రామస్థుల కష్టాలను అడిగి తెలుసుకుని రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామ సమస్యలను పరిష్కరించి, మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అప్పుడు ఏర్పడిన అనుబంధంతోనే ఇప్పుడు వారికి తన తోటలోని పండ్లను పంపించారు. గతంలో పెద్దపాడు గ్రామస్ధులకు చెప్పులు అందజేశారు.