Electricity Bills : ఫోన్ పే, జీ పేలో కరెంట్ బిల్లు కట్టొచ్చు.. పండగ చేస్కోండి
విద్యుత్ బిల్లుల చెల్లింపునకు మళ్లీ పాత విధానమే అమల్లోకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని విద్యుత్ వినియోగదారులకు ఆయా డిస్కంలు శుభవార్త చెప్పాయి. విద్యుత్ బిల్లుల చెల్లింపును గతంలో మాదిరిగానే సులభంగా చేసుకు ఎందుకు ప్రభుత్వాలు వీలుకల్పిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. బిల్లుల చెల్లింపునకు సంబంధించి టీజీ ఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్ తమ నిర్ణయాలను ప్రకటించాయి. ఫోనే, గూగుల్ పే వంటి డిజిటల్ చెల్లింపులకు గతంలో డిస్కమ్ లు గుడ్ బై చెప్పగా.. తాజాగా ఆదే విధానాన్ని మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపాయి.
యూపీఐల ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించడాన్ని అడ్డుకోవడంతో పెద్ద ఎత్తున బకాయిలు పేరుకుపోయినట్టు అధికారులు గుర్తించారు. దాంతో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు షాక్ అయ్యారు. ఈ క్రమంలోనే ఫోన్ పే చెల్లింపులను పునరుద్ధరించినట్లు ఉన్నతాధికారులు చెప్పారు. టీజీ ఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్ యాప్ తో పాటుగా.. ఫోన్ పే ద్వారా కరెంటు బిల్లులను చెల్లించవచ్చని అధికారులు తెలిపారు.
ఒకప్పుడు విద్యుత్ వినియోగదారులు ప్రతినెలా విద్యుత్ కార్యాలయాలకు వెళ్లి గంటల తరబడి క్యూలో నిలబడి బిల్లులు చెల్లించేవారు. వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న డిస్కమ్ లు యూపీఐ ద్వారా విద్యుత్ బిల్లులను చెల్లించే అవకాశం కల్పించింది. వినియోగదారులు ఫోన్ పే, గూగుల్ పే ఈజీగా చెల్లించేవారు. సజావుగా సాగుతున్న తరుణంలో.. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ఈ చెల్లింపులు కుదరదని నెల రోజుల క్రితమే డిస్కమ్ లు నిర్ణయం తీసుకున్నాయి. ఇది బెడిసికొట్టిందని తెలిసి మళ్లీ పాత పద్ధతిని అనుసరిస్తున్నారు.