PEDDIREDDY: కలకలం రేపుతోన్న "పెద్దిరెడ్డి" అటవీ ఆక్రమణ
ఆక్రమణలు నిజమేనన్న అటవీశాఖ అధికారులు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చిత్తూరు జిల్లాలోని మంగళంపేట అటవీ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , కుటుంబ సభ్యుల అక్రమ భూమి ఆక్రమణలను బహిర్గతం చేసే సంచలనాత్మక వీడియోను విడుదల చేశారు. రక్షిత అటవీ భూముల్లో 76.74 ఎకరాలు ఆక్రమించుకుని, వాటిపై అక్రమ కట్టడాలు నిర్మించారని, రెవెన్యూ రికార్డులను తారుమారు చేశారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఇటీవల ఏరియల్ సర్వేలో స్వయంగా ఈ ప్రాంతాన్ని పరిశీలించి వీడియోలు తీశారు. విజిలెన్స్ విభాగం నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఆక్రమణలు వెలుగులోకి
చిత్తూరు జిల్లా తూర్పు కనుమలలోని మంగళంపేట రక్షిత అటవీ ప్రాంతంలో జరిగిన ప్రత్యేక ఏరియల్ సర్వేలో ఈ ఆక్రమణలు వెలుగులోకి వచ్చాయి. పవన్ కల్యాణ్ తన తాజా తిరుపతి పర్యటన సందర్భంగా హెలికాప్టర్లో ఈ ప్రాంతాన్ని సందర్శించి, భూమి ఆక్రమణలను డాక్యుమెంట్ చేశారు. వీడియోల్లో కనిపించే దృశ్యాల ప్రకారం, అటవీ మధ్యలో గెస్ట్ హౌస్లు, ఇతర అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. ఈ భూములు పెద్దిరెడ్డి కుటుంబానికి చెందిన వారసత్వ ఆస్తులుగా అధికార దుర్వినియోగంతో రికార్డు మార్చారని ఆయన ఆరోపించారు. అటవీ భూములు మన పర్యావరణానికి, భవిష్యత్తుకు అమూల్యమైనవి. వీటిని రాజకీయ నేతలు ఆక్రమించుకోవడం అనేది తీవ్రమైన నేరం అని పవన్ స్పష్టం చేశారు. ఈ ఆక్రమణలు వైసీపీ పాలిత దశలో జరిగాయని, తమ ప్రభుత్వం ఇటువంటి అక్రమాలను సహించదని స్పష్టం చేశారు.
ఆక్రమణలు జరిగిన మాట వాస్తవమే
చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట అటవీ భూములలో ఆక్రమణలు చోటు చేసుకున్న మాట వాస్తవం. ఇందుకు సంబంధించి భారత న్యాయసంహితను అనుసరించి ఏపీ అటవీ చట్టంలోని 61 (2),20 (1)(డి)(2), 52(డి) ప్రకారం కేసులు నమోదు చేశాము. ఈ కేసులో ఏ1గా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఉన్నారు. ఏ2గా పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఏ3గా పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, ఏ4గా పెద్దిరెడ్డి ఇందిరమ్మ పేర్లు నమోదు చేశాము. అటవీ చట్టం ప్రకారం ప్రిలిమినరీ అఫెన్స్ రిపోర్ట్ (పీవోఆర్) ప్రకారం చార్జిషీటు దాఖలు చేశాం. ఆక్రమణకు గురైన 32.63 ఎకరాల భూమిని స్వాధీనం చేస్తుకున్నాం. కోర్టులో కేసుల వివరాలు దాఖలు చేశామని పీసీసీఎఫ్ (హెచ్.ఓ.ఎఫ్.ఎఫ్.) కార్యాలయం ప్రకటన చేసింది.