కూటమి ప్రభుత్వం ఎంతో బాధ్యతతో ప్రజలకు సేవ చేస్తుందని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ‘‘సుపరిపాలనలో తొలి అడుగు’’ కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వము ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమంలో భాగంగా ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి మంత్రి పయ్యావుల కేశవ్ ఉరవకొండ నియోజకవర్గంలోని జయపురం గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు వివరించి వారికి ప్రభుత్వం నుండి అందుతున్న లబ్ది వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు కూటమి ప్రభుత్వం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారని.. ఇది బాధ్యత కలిగిన మంచి ప్రభుత్వమని చెప్తున్నారని మంత్రి తెలిపారు.
గతంలో అరాచక పాలన సాగిందని.. వైసీపీ నేతలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని మంత్రి పయ్యావుల ఆరోపించారు. సంక్షేమం అంటే అన్ని పథకాలు ఆపేసి నాలుగు పథకాలు అమలు చేయడం కాదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ ను రూ.4 వేలకు పెంచామన్నారు. గత ప్రభుత్వం 45 లక్షల మందికి అమ్మఒడి వేస్తే.. కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో 67 లక్షల మంది పిల్లలకు రూ.10 వేల కోట్లు ఇవ్వడం జరిగిందన్నారు. దీపం పథకం, అన్నా క్యాంటీన్లు ప్రారంభించినట్లు తెలిపారు. తాము బాధ్యతతో ప్రజల కోసం పని చేస్తున్నామనీ, ఇంకా చేయలసింది ఎంతో ఉందనీ, జిల్లా రుణం తీర్చుకుంటానని మంత్రి అన్నారు.