రాజమండ్రిలోని బొల్లినేని కిమ్స్ ఆస్పత్రిలో 12 రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న ఫార్మసీ విద్యార్థిని నాగ అంజలి మృతిచెందారు. ఇవాళ తెల్లవారుజామున స్ట్రోక్ రావడంతో ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఓ వ్యక్తి చేతిలో మోసపోయానని గత నెల 23న ఆమె ఆత్మహత్యాయత్నం చేశారు. సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
లైంగిక వేధింపులకు గురై ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టి చావుబతుకుల్లో ఉన్న ఫార్మసీ ఫైనలియర్ విద్యార్థిని కేసు దర్యాప్తు దారి తప్పుతోందన్న అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కిమ్స్ బొల్లినేని ఆస్పత్రిలో ఈ ఘటన జరిగితే మూడు రోజులు గోప్యంగా ఉంచడం గమనార్హం. బాధిత విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి కారకుడైన కిమ్స్ బొల్లినేని ఆస్పత్రి ఏజీఎం దువ్వాడ మాధవరావు దీపక్ టీడీపీలో క్రియాశీల నేతగా వ్యవహరిస్తున్నందున కేసును నీరుగార్చే యత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.