AP: కూటమి జోరు.. వైసీపీ బేజారు

ఏపీలో పొలిటికల్ హీట్... వైసీపీ నేతల వరుస అరెస్టులు... అధికారుల మెడకూ బిగుస్తున్న ఉచ్చు;

Update: 2025-04-27 06:30 GMT

వారం రోజుల నుంచి ఏపీలో అరెస్టుల పర్వం ఊపందుకుంది. ఐదేళ్లు హాయిగా వ్యాపార కార్యకలాపాలు సాగించిన వైసీపీ నేతలు ఇప్పుడు అధికారం కోల్పోయాక కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నారు. అప్పట్లో వాళ్ళు చేసిన తప్పులు ఇప్పుడు సంకెళ్ళుగా మారి చేతులకు చుట్టుకుంటున్నాయి. ఇన్నాళ్లు అరెస్టుల విషయంలో కాస్త నింపాదిగా ఉన్న కూటమి సర్కారు... ఉన్నపళంగా స్పీడు పెంచేసింది. గడిచిన వారం రోజుల్లో వైసీపీకి లెక్కలేనన్ని షాకులిచ్చింది. కేవలం పార్టీ నేతలే కాదు, అప్పటికి వైసీపీ సర్కారు ఏం చెప్పినా సరే అని గంగిరెద్దుగా తలాడించి అడ్డమైన పనులు చేసిన అధికారులకు కూడా ఊచలు లెక్కపెట్టే గతే పడుతోంది. 

పెద్దిరెడ్డి ఫ్యామిలీకి షాక్

చిత్తూరు జిల్లాలో మకుటంలేని రాజకీయ కుటుంబం ఏదైనా ఉందా అంటే అది పెద్దిరెడ్డి కుటుంబం అనే చెప్పాలి. ఇప్పుడు ఆ ఫ్యామిలీ కూడా ఇబ్బందులు పడుతోంది. మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్లను కాల్చివేసిన ఘటనలో మాధవరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాధవరెడ్డి ఇప్పటికే ముందస్తు బెయిల్ తీసుకున్నా పోలీసులు దాన్ని క్యాన్సిల్ చేయించి మరీ అరెస్ట్ చేశారు. పెద్దిరెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన మాధవరెడ్డి... పోలీసుల విచారణలో గుట్టంతా విప్పేస్తే పెద్ద పెద్ద తలకాయలు కూడా జైలుపాలు కావడం ఖాయం కనిపిస్తోంది. 

క్యాడర్ ను నిరుత్సాహ పరిచిన సర్కార్

టీడీపీ, జనసేన ప్రతిపక్షాలుగా ఉన్నప్పుడు వైసీపీ నేతలు వారిపై బూతులతో రెచ్చిపోయారు. పైగా సామాన్య ప్రజలను కూడా నానా హింసల పెట్టారు. ఉద్యోగస్తులకు కూడా నిరసన వ్యక్తం చేసే స్వేచ్ఛను ఇవ్వలేదు జగన్ సర్కారు. కానీ అధికారాన్ని చేపట్టిన కూటమి అరెస్టుల విషయంలో మాత్రం నింపాదిగానే వ్యవహరిస్తూ వచ్చింది. ఈ విషయంలో వెల్లువెత్తిన విమర్శలకు వివరణ కూడా ఇచ్చింది.  ప్రతి దానిలో చట్ట ప్రకారమే ముందుకు వెళతామని, కక్షపూరిత రాజకీయాలు చేస్తే వారికి మనకు తేడా ఉండదని చెప్పుకొచ్చింది. ప్రజలకు అన్యాయం చేసిన వారిని అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. చెప్పిన ప్రకారమే చేసుకుంటూ వెళుతోంది కూడా, అందుకు ఉదాహరణ చెప్పాలంటే, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆయన తోడల్లుడు చాణక్య, సజ్జల శ్రీధర్ రెడ్డి, మాజీ మంత్రి విడదల రజని మరిది విడదల గోపి అరెస్ట్ అయ్యారు.

Tags:    

Similar News