MLA Palle Sindhoora Reddy : కష్టపడి పనిచేసిన కార్యకర్తలకే పదవులు : ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి
టిడిపి కార్యకర్తల పార్టీ అని పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు ప్రభుత్వ పదవులు లభిస్తాయని ఎమ్మెల్యే సింధూర రెడ్డి పేర్కొన్నారు. నల్లమాడ సహకార సొసైటీ అధ్యక్షులు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే సింధూర రెడ్డికి పార్టీ కార్యకర్తలు నాయకులు పూల వర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీకి పనిచేసిన కార్యకర్తలకే పార్టీ తగిన గుర్తింపు ఇచ్చి ప్రభుత్వ పదవుల్లో పెద్ద పీట వేస్తోందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోని అనేక సంక్షేమ ,అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. నియోజకవర్గంలోని 193 చెరువులు నీటితో నింపి ఈ ప్రాంతాన్ని సస్య శ్యామలం చేస్తామన్నారు. గత ఐదేళ్ల కాలంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాతియుగం నుంచి సువర్ణ యుగం వైపు పరుగులు తీస్తున్నామని పేర్కొన్నారు. మన రాజధాని ఇంత గొప్పగా ఉంటుందా అని ప్రతి ఒక్క ఆంధ్రుడు సంతోషపడేలా చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మాణం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డిని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని గ్రామాల్లోనూ పార్టీ ఘన విజయం సాధించేందుకు ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలన్నారు. అనంతరం సింగిల్ విండో ప్రెసిడెంట్ గా ప్రమాణస్వీకారం చేసిన బడ రమణారెడ్డి డైరెక్టర్లు నాగేనాయక్ , గంగులప్పను ఎమ్మెల్యే పల్లె సింధూర ,మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ప్రత్యేక శాలువాలతో సన్మానించి సత్కరించారు.