CBN PROTESTS: విదేశాల్లో నిరసనల హోరు

ప్రవాసాంధ్రుల భారీ నిరసన ప్రదర్శనలు... చంద్రబాబుకు మద్దతుగా నినాదాలు;

Update: 2023-09-19 02:15 GMT

విదేశాల్లో వియ్ ఆర్ విత్‌ CBN నినాదాలు ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. అమెరికా నుంచి ఆస్ట్రేలియా దాకా ఆందోళనలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. భారీ నిరసన ప్రదర్శనలతో చంద్రబాబుకు మద్దతును, వైసీపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టుపై నిరసన జ్వాలలు విదేశాల్లోనూ వెల్లువెత్తుతున్నాయి. విదేశాల్లో స్థిరపడ్డ తెలుగు ప్రజలు చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ ఆందోళనలతో కదం తొక్కుతున్నారు. అవినీతి ఆరోపణలతో చంద్రబాబును సీఐడీ అరెస్టును తీవ్రంగా తప్పుపడుతూ విదేశాల్లో నిరసనలు తీవ్రరూపం దాల్చాయి.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ప్రభుత్వం కావాలనే కక్ష సాధిస్తుందని అమెరికా రాజధాని వాషింగ్టన్‌ DCలో మహిళలు నిరసన తెలిపారు. ఈ విపత్కర పరిస్థితుల్లో తామంతా చంద్రబాబు వెంటే ఉన్నామని తేల్చిచెప్పారు. త్వరలోనే చంద్రబాబుపై పడ్డ ఆరోపణలన్నీ కొట్టుకుపోతాయని ఆకాంక్షించారు. తెలుగుదేశం అధినేత అరెస్టు అక్రమమంటూ.. అమెరికాలోని ఆస్టిన్‌ నగరంలో ప్రవాసాంధ్రులు ధర్నాకు దిగారు. జగన్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ 400 మందికి పైగా ప్రవాసాంధ్రులు... తెలుగుదేశం సానుభూతిపరులు... కుటుంబాలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కక్షపూరితంగా నిర్బంధించడం నిరంకుశ పాలనకు నిదర్శనమని మండిపడ్డారు.

చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కెనడాలోని టొరంటోలో ప్రవాసాంధ్రులు భారీ ప్రదర్శన చేపట్టారు. ప్రవాసాంధ్రులకు సంఘీభావంగా కెనడాలోని స్థానికులూ పెద్ద సంఖ్యలో ర్యాలీలు, ప్రదర్శనల్లో పాల్గొన్నారు. టొరంటోలో భారత రాయబారి కార్యాలయం వరకు 3 కిలోమీటర్ల మేర భారీ నిరనస ప్రదర్శన నిర్వహించారు. నిజాయతీపరులకు న్యాయం జరిగేందుకు అందరూ కలిసి పోరాడాలని కెనడాలోని ప్రవాసాంధ్రులు పిలుపునిచ్చారు. ఆధారాల్లేకుండా అరెస్టు చేసి చంద్రబాబును అక్రమంగా నిర్బంధించారని ఆందోళనకారులు మండిపడ్డారు. చంద్రబాబు విడుదల అయ్యేలా చర్యలు చేపట్టాలని కోరుతూ కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాకు వినతిపత్రం అందించారు.

అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రంలోని రెలై ప్రాంతంలోనూ పెద్ద సంఖ్యలో తెలుగువారు బయటకు వచ్చి నిరసనలు తెలిపారు. ఐటీ విప్లవానికి తొలినాళ్లలోనే ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాంది పలకడం వల్లే... తామంతా ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డామని గుర్తుచేశారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానాన్ని ప్రవాసాంధ్రులు తీవ్రంగా తప్పుపట్టారు. త్వరలోనే ఆయన బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News