MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబుపై కీలక ఆరోపణలు.. ఎన్నో అక్రమాలు..

MLC Ananthababu: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుది మొదటి నుంచి వివాదాస్పదమైన వ్యవహారమే అని స్థానికులు అంటున్నారు.

Update: 2022-05-24 12:00 GMT

MLC Ananthababu: కాకినాడలో డ్రైవర్ సుబ్రమణ్యం హత్యకేసులో అరెస్టైన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుది మొదటి నుంచి వివాదాస్పదమైన వ్యవహారమే అని స్థానికులు అంటున్నారు. ఆయన తన నియోజకవర్గంలో ఓ మోనార్క్‌గా వ్యవహరిస్తారనేది నగ్నసత్యం. అధికారులైనా.. నేతలైనా.. అంతా తాను చెప్పినట్లు వినాల్సిందే. తాను చెప్పిందే వేదం.. మాట్లాడిందే శాసనం. మన్యంలో అక్రమ కలప రవాణా, కోట్ల విలువచేసే రంగురాళ్లవ్యాపారం, మట్టితవ్వకాలు, ఇసుక దోపిడీ, పేకాట శిబిరాలు అన్ని ఈయన గారి కనుసన్నల్లోనే జరుగుతాయని ఆరోపణలు ఉన్నాయి..

అధికార పార్టీకి చెందిన నేత.. అందులో సీఎంకు అత్యంత సన్నిహితుడు కావడంతో .. ఇన్నాళ్లు ఆయన ఆడిందేఆట.. పాడిందే పాటగా సాగుతోందంటున్నారు.. దీనిలో భాగంగా సుబ్రమణ్యం హత్యకేసులోను ఆయన తప్పించుకునేందుకు విశ్వప్రయత్నంచేసినా.. విపక్షాల నుంచి పెద్దయెత్తున నిరసన వెల్లవెత్తడంతో అతని పాచిక పారలేకపోయింది. రంపచోడవరం డివిజన్‌లో ఎమ్మెల్సీ అనంత' అక్రమాలుచాలానే ఉన్నాయి. అడ్డతీ గల మండలం గొంటువానిపాలెంలో బినామీల పేరిట మెటల్‌ క్వారీలు, చేపల చెరువులు నడిపిస్తున్నట్లు తెలుస్తోంది.

మన్యం నుంచి కలప విచ్చలవిడిగా హద్దులు దాటించడం.. గంజాయి సాగు, అక్రమ రవాణా వ్యవహారంలోనూ అనంత రూటే వేరు. అయితే ఇంత జరుగుతున్నా ఆయన పేరు ఎక్కడా బయటకు రాదు. అక్రమాలు కళ్లెదుట సాగిపోతున్నా అధికారులు ప్రశ్నించే పరిస్థితి లేదంటున్నారు జనం. ఏజెన్సీలో పనులు చేపట్టే గుత్తేదారులు, ఇంజినీరింగ్‌ అధికారుల నుంచి పెద్దమొత్తంలో వాటాలు అందుతాయనే ప్రచారం ఉంది. అడ్డతీగల పోలీసు స్టేషన్‌లో అనంతబాబుపై గతంలో రౌడీషీటర్‌గా కేసు నమోదైంది. వైసీపీ అధికారంలోకి రాగానే ఆ రౌడీషీట్‌ ఎత్తేయించినట్లు తెలుస్తోంది. .

తూర్పుగోదావరిజిల్లా అడ్డతీగల మండలం ఎల్లవరం గ్రామానికి చెందిన అనంతబాబు.. సామాన్య కార్యకర్త నుంచి ఎమ్మెల్సీగా ఎదిగారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఈయన 1998లో కాంగ్రెస్‌లో కార్యకర్తగా చేరారు. 2001లో తూర్పుకాపు కోటాలో అడ్డతీగల జడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2006లో కొండ కాపుగా ఎస్టీ నకిలీ కుల ధ్రువపత్రంతో అడ్డతీగల ఎంపీపీ అయ్యారు. వైసీపీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరి తూర్పుగోదావరి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా, రంపచోడవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా పనిచేశారు.

2014 శాసనసభ ఎన్నికల్లో కొండకాపుగా నకిలీ కుల ధ్రువీకరణ పత్రంతో నామినేషన్‌ వేయగా.. ప్రత్యర్థులు అనంతబాబు ఎస్టీ కాదని ఆధారాలు చూపించడంతో నామినేషన్‌ తిరస్కరించారు. దీంతో నామినీగా ఉన్న వంతల రాజేశ్వరిని అభ్యర్థిగా ప్రకటించారు. ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందినా.. అనంతబాబు అన్నీ తానై వ్యవహరించారు. అనంతబాబు వైసీపీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మిని నిలబెట్టి గెలిపించారు. అయితే ఆమె ఏ పనిచేయాలన్నా అనంతబాబే మొత్తం వ్యవహారం నడిపించేవాడు. తన కనుసన్నల్లోనే పార్టీ కార్యకర్త, ప్రజాప్రతినిధి ఉండాలని కోరుకుంటారు. ఎవరు గెలిచినా పాలన అంతా తన కనుసన్నల్లో జరగాల్సిందే.. అనుచరులతో బెదిరింపులు, దందాలూ ఇక్కడ సాధారణం.. అందుకే ఆయన పేరెత్తితే మన్యంలో ఎవరికైనా వణుకుపుట్టాల్సిందే.  

Tags:    

Similar News