తిరుమలలో ప్రసాదాల నాణ్యతపై గతంలో ఎన్నోసార్లు టీటీడీ ఛైర్మన్, ఈవో దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకపోయిందని మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు ఆవేదనవ్యక్తం చేశారు. పవిత్రమైన ఆవు నెయ్యిని కల్తీ చేసి శ్రీవారి ప్రసాదాల్లో వినియోగించడం అపచారమన్నారు. తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడారు.
"శ్రీవారి ప్రసాదాల నాణ్యతపై ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లాను. నాది ఒంటరి పోరాటం అయిపోయింది. తొటి అర్చకులెవరూ వారి వ్యక్తిగత కారణాల వల్ల ముందుకురాలేదు. గత ఐదేళ్లూ నిరభ్యం తరంగా ఈ మహాపాపం జరిగిపోయింది. నెయ్యి పరీక్షలకు సంబంధించిన ల్యాబ్ నివేదికలు చూశాను. నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు అందులో ఉంది. పరిశుభ్రమైన ఆవు పాలతో తయారైన నెయ్యిలో కొవ్వు పదార్థాలు కలిసేందుకు వీలు లేదు. తిరుమలను ప్రక్షాళన చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. దీనికోసం ఎన్నో చర్యలు చేపట్టారు. కర్ణాటకలోని నందిని డెయిరీ నుంచి నెయ్యిని వినియోగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం..." అని రమణదీక్షితులు వివరించారు.
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీపై సమగ్ర విచారణ జరపాలని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధా నార్చకులు రంగరాజన్ కోరారు. 'భయంకరమైన, నమ్మలేని నిజమిది' అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రత్యక్ష వైకుంఠ క్షేత్రమైన తిరుమలలో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకాంక్షిస్తున్నట్లు జాతీయ స్థాయిలో ధార్మిక పరిషత్ ను ఏర్పాటుచేయాలన్నారు.