వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఈ నెల 23 వరకు రిమాండ్ పొడిగిస్తూ సీఐడీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో జైలులో ఉన్న ఆయనతో పాటు మరో 9 మంది రిమాండ్ గడువు ఇవాళ్టితో ముగియడంతో అధికారులు కోర్టులో హాజరుపరిచారు. వారి జ్యుడీషియల్ కస్టడీ పొడిగించాలన్న పోలీసుల వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ఆమేరకు ఆదేశాలిచ్చింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీతో పాటు రిమాండ్ ఖైదీలుగా ఉన్న మరో 9 మందిని బుధవారం సీఐడీ అధికారులు న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ నెల 23 వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
వల్లభనేని వంశీని 2023లో గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఫిబ్రవరి 13, 2025న హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు.గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సాక్షిగా ఉన్న ముదునూరి సత్యవర్ధన్ అనే వ్యక్తిని వల్లభనేని వంశీ బెదిరించి, కిడ్నాప్ చేసి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేయించాడని ఆరోపణలు వచ్చాయి. సత్యవర్ధన్ మొదట కోర్టులో తనకు ఈ కేసుతో సంబంధం లేదని చెప్పాడు.