నమస్కారానికి ప్రతి నమస్కారం మన సంస్కారం. అది మనుషులు అయిన సరే...రోబోలు అయిన సరే.. మనకు నమస్కరించిన వాళ్లకు తిరిగి నమస్కరించడం పద్ధతి. తనకు నమస్కరించి వెల్కమ్ చెప్పిన రోబోకు తిరిగి నమస్కరించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఇలాంటి ఆసక్తికర ఘటనకు వేదిక అయింది మంగళగిరి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆయనకు, ఓ రోబో ఎదురొచ్చి నమస్కారం చేసింది. ఈ అనూహ్య పలకరింపునకు ఆశ్చర్యపోయిన చంద్రబాబు, ఆ రోబోకు ప్రతి నమస్కారం చేశారు. కాగా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్‌లో ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమం నుంచే విశాఖపట్నం, రాజమహేంద్రవరం, అనంతపురం, తిరుపతిలలో ఏర్పాటు చేసిన మరో నాలుగు హబ్‌లను కూడా వర్చువల్ విధానంలో ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్, నాదెండ్ల మనోహర్, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. "వన్ ఫ్యామిలీ ...వన్ ఎంటర్ ప్యూనర్" అన్నదే తమ ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు. యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా, పది మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. రతన్ టాటా ఆలోచనలు, ఆశయాలను సజీవంగా ఉంచేందుకే ఈ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటిల్లో ప్రముఖ సంస్థలు యువతకు శిక్షణ ఇస్తాయని... దీనిని యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.