SANKRANTHI: పండుగ ప్రయాణానికి ప్రత్యేక ఏర్పాట్లు
ఏపీలో రికార్డు స్థాయిలో 8,432 బస్సులు... అదనపు ఛార్జీలు లేకుండానే ప్రత్యేక బస్సులు...ప్రత్యేక ఆఫర్ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ
తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి వచ్చేసింది. ఊళ్లకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి.ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ నుంచి సామాన్యుడిని కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. ఏపీఎస్ఆర్టీసీ ఈ ఏడాది రికార్డు స్థాయిలో 8,432 ప్రత్యేక బస్సులను పండుగ కోసం రంగంలోకి దించింది. గతంలో స్పెషల్ బస్సుల పేరుతో 50% అదనపు ఛార్జీలు వసూలు చేసేవారు. కానీ ఈ 2026 సంక్రాంతికి కేవలం సాధారణ ఛార్జీలతోనే స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల నుంచి పల్లెలకు వెళ్లే వారికి ఇది ఒక పెద్ద ఊరట.ఇక తెలంగాణ ఆర్టీసీ విషయానికి వస్తే.. ప్రయాణికుల కోసం ఒక అద్భుతమైన ఆఫర్ తెచ్చింది. హైదరాబాద్ నుంచి మీ ఊరికి వెళ్లడానికి తిరిగి రావడానికి అంటే రౌండ్ ట్రిప్ ఒకేసారి టికెట్ బుక్ చేసుకుంటే, తిరుగు ప్రయాణం టికెట్ ధరపై 10% రాయితీ ఇస్తున్నారు. సుమారు 6,431 పైగా బస్సులు అందుబాటులో ఉన్నాయి. పండుగల వేళ ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలు ఇంకా తగ్గలేదు. హైదరాబాద్ నుంచి విశాఖకు బస్సు టికెట్ ధర ఏకంగా 5 వేల నుంచి 7 వేల వరకు పలుకుతోంది. ఇది విమాన ప్రయాణం కంటే ఎక్కువ. ప్రభుత్వాలు ఎన్ని బస్సులు వేసినా, ప్రైవేట్ ఆపరేటర్లపై నిఘా పెట్టడంలో విఫలమవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
దాంతోపాటు రద్దీ వల్ల టోల్ ప్లాజాల వద్ద గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది. సంక్రాంతి 2026 కోసం రైల్వే శాఖ కూడా మునుపెన్నడూ లేని విధంగా భారీ ఏర్పాట్లు చేస్తోంది. సంక్రాంతి ప్రయాణీకులకు రైల్వే శాఖ నుండి అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. బస్సుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, సామాన్యుడి ప్రయాణాన్ని సుఖమయం చేయడానికి దక్షిణ మధ్య రైల్వే భారీ ప్లాన్‌తో ముందుకొచ్చింది. సంక్రాంతి రద్దీని తగ్గించడానికి దక్షిణ మధ్య రైల్వే ఈ ఏడాది ఏకంగా సుమారు 600 వరకు ప్రత్యేక రైళ్లను వివిధ విడతల్లో ప్రకటించింది. గతంతో పోలిస్తే ఇది చాలా పెద్ద సంఖ్య అని చెప్పవచ్చు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో రద్దీ ఎక్కువగా ఉండే రూట్లపై రైల్వే ప్రత్యేక దృష్టి సారించింది.సికింద్రాబాద్, వికారాబాద్ మరియు లింగంపల్లి నుండి.. కాకినాడ టౌన్, నర్సాపూర్, తిరుపతి, శ్రీకాకుళం, అనకాపల్లి మరియు విశాఖపట్నం మార్గాల్లో అత్యధిక సంఖ్యలో రైళ్లు నడుస్తున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లు జనవరి 8 నుండి 20 మధ్య అందుబాటులో ఉంటాయి. చాలామంది ప్రత్యేక రైళ్లంటే కేవలం ఏసీ కోచ్‌లే ఉంటాయని అనుకుంటారు. కానీ ఈసారి రైల్వే అన్ని వర్గాల వారికి ప్రాధాన్యతనిచ్చింది. ఈ స్పెషల్ ట్రైన్స్‌లో 1AC, 2AC, 3AC తో పాటు సామాన్యుల కోసం కోచ్‌లు అందుబాటులో ఉంటాయి.