సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో బస్సులు, రైళ్లు రద్దీగా మారాయి. ఈ నేపథ్యంలో రవాణాశాఖ అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన పట్టణాల నుంచి పల్లెలకు ప్రయాణికులను చేరవేసేందుకు ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల బస్సులను ఉపయోగించుకోవాలని సూచించారు. ఆయా బస్సులకు ముందుగా ఫిట్‌నెస్ టెస్టులను చేయాలన్నారు. ఎక్కడా ప్రయాణికులు ఇబ్బంది పడొద్దని స్పష్టం చేశారు.
సీఎం చంద్రబాబు ఆదేశాల నేపథ్యంలో ఆర్టీసీ, రవాణా, పోలీసు శాఖ అధికారులతో సంస్థ ఎండీ ద్వారకా తిరుమల రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బస్టాండ్లలో రద్దీపై వారితో చర్చించారు. రద్దీ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. బస్టాండ్లలో ప్రయాణికులు నిరీక్షించకుండా వెంటనే బస్సులు ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకోసం అవసరమైన చోట్ల ప్రైవేటు విద్యాసంస్థల బస్సులను తీసుకోవాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రైవేటు విద్యాసంస్థల బస్సుల బాధ్యత రవాణా శాఖ అధికారులదేనని.. కండిషన్‌లో ఉన్న వాటినే తీసుకోవాలని ఆదేశించారు.