NARA BHUVANESHWARI: అధైర్యపడొద్దు.. నిజమే గెలుస్తుంది

కార్యకర్తలకు నారా భువనేశ్వరి పిలుపు.... త్వరలోనే చంద్రబాబు బయటకు వస్తారని ధీమా...

Update: 2023-09-21 04:30 GMT

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్టుతో ఎవ్వరూ అధైర్యపడొద్దని... తెలుగుదేశం శ్రేణులకు భువనేశ్వరి పిలుపునిచ్చారు. జైలులో ఉన్నా కార్యకర్తల బాగు కోసమే ఆయన పరితపిస్తున్నారని చెప్పారు. ఏ తప్పూ చేయని చంద్రబాబు త్వరలోనే బయటకు వస్తారని భువనేశ్వరి విశ్వాసం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రముఖులు, కార్యకర్తలు, ఆయన సతీమణి నారా భువనేశ్వరికి సంఘీభావం తెలిపారు. రాజమహేంద్రవరంలో భువనేశ్వరి సహా నారా, నందమూరి కుటుంబసభ్యులను కలిసి పరామర్శించారు. చంద్రబాబు, ఆయన కుటుంబం పట్ల వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా తప్పుపట్టారు.


ప్రముఖ సినీ నిర్మాత, సూపర్‌స్టార్ కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు... తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సహా, కుటుంబసభ్యులను రాజమహేంద్రవరంలో పరామర్శించారు. చంద్రబాబు అరెస్టును తప్పుపట్టిన ఆదిశేషగిరిరావు... ఈ తరహా కక్షసాధింపు రాజకీయాలను ఎన్నడూ చూడలేదన్నారు. ధైర్యంగా ఉండాలని భువనేశ్వరికి చెప్పినట్లు తెలిపారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం సరైందికాదని ఆక్షేపించారు.


స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు కుటుంబానికి రాజకీయ నాయకులు, ప్రముఖుల మద్దతు పెరుగుతోంది. పీసీసీ మాజీ అధ్యక్షుడు శైలజానాథ్‌... చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని రాజమహేంద్రవరంలో పరామర్శించారు. చంద్రబాబు అరెస్టు తీరును ఖండిస్తూ... నారా, నందమూరి కుటుంబసభ్యులకు సంఘీభావం తెలిపారు. రాష్ట్రంలో పగ, ప్రతీకారాలే రాజ్యమేలుతున్నాయని శైలజానాథ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్షసాధింపులకు... ప్రైవేటు న్యాయవాదులను పెట్టి... ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. కష్టకాలంలో చంద్రబాబు కుటుంబానికి నైతికంగా మద్దతుగా నిలబడతామన్నారు.

చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ అరగుండుతో నిరసన తెలుపుతూ... అహ్మద్‌ బాషా అనే కార్యకర్త ప్రకాశం జిల్లా గిద్దలూరు నుంచి రాజమహేంద్రవరం వచ్చారు. అహ్మద్‌బాషాతోపాటు, చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ఇతర కార్యకర్తలతో భువనేశ్వరి మాట్లాడారు. సంయమనంతో ఉండాలని భువనేశ్వరి కార్యకర్తలకు సూచించారు. చంద్రబాబు అరెస్టైన రోజు నుంచి తీవ్రంగా కలత చెంది ఉన్నానని అహ్మద్‌ బాషా తెలిపారు. ఆయన జైలు నుంచి బయటకు వచ్చేంత వరకూ అరగుండుతోనే రాష్ట్రమంతా తిరుగుతానని చెప్పారు.

Tags:    

Similar News