ఏపీ లిక్కర్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఇందులోని అందరి పాత్రలపైనా ఫోకస్ పెట్టింది. లిక్కర్ స్కామ్ లో ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఇందులో భాగంగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో ఇప్పటికే విజయసాయిని సిట్ విచారించింది. మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని అప్పుడే అధికారులు చెప్పారు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 12న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని అందులో స్పష్టం చేశారు. లిక్కర్ స్కాం కేసులో సాక్ష్యం చెప్పాలని తెలిపారు. ఏప్రిల్ 18న తొలిసారి విచారణకు హాజరైన సమయంలో లిక్కర్ కేసులో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పాత్రతో పాటు మిగిలిన నిందితుల వివరాలను సిట్ అధికారులకు విజయసాయి అందించినట్లు వివరించారు. ఈ సారి ఆయన ఎటువంటి వివరాలు బయటపెడతారన్నది ఆసక్తిగా మారింది.