Andhra Pradesh: ఏపీలో కొత్త కేబినెట్.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, రాజీనామాల సెగ..

Andhra Pradesh: మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ వ్యవహారం అధికార వైసీపీలో ప్రకంపనలు రేపుతోంది.

Update: 2022-04-12 02:46 GMT

Andhra Pradesh: మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ వ్యవహారం అధికార వైసీపీలో ప్రకంపనలు రేపుతోంది. రాజీనామా విషయంలో తగ్గేదేలేదన్నంటున్నారు మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత. ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు బుజ్జగింపులకు ప్రయత్నించినా.. ఆమె ససేమిరా అంటున్నారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్లు ప్రకటించారు.

ఇటు మరో సీనియర్‌ నేత బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. బుజ్జగించే బాధ్యతలు తీసుకున్న సజ్జల... ఆయన ఇంటికి వెళ్లి పలుమార్లు చర్చించినా ఫలితం దక్కలేదు. చివరి సీఎం జగనే రంగంలోకి దిగి.. తాడేపల్లికి పిలుపించుకుని మరీ బానినేనిని బుజ్జగించారు. దీంతో కాస్త స్వరం మార్చిన బాలినేని... తాను రాజీనామా చేయడం లేదని ప్రకటించారు. అయితే మంత్రి పదవిలో కొనసాగకపోవడంతో ఫీల్‌ అయినట్లు తెలిపారు.

మంత్రివర్గంలో బాలినేని శ్రీనివాస్‌రెడ్డికి అవకాశం ఇవ్వకపోవడంపై ఒంగోలు వైసీపీ కేడర్‌ తీవ్ర అసంతృప్తిలో ఉంది. పదవులకు రాజీనామాలు చేసేందుకు సిద్ధమవడంతో పాటు ఆందోళన బాట పట్టారు. ఇప్పటికే బాలినేనికి మద్దతుగా జిల్లాకు చెందిన పలువరు జెడ్పీటీసీలు రాజీనామా చేయగా.. ఒంగోలు కార్పొరేషన్‌ పరిధిలోని కార్పొరేటర్లు రాజీనామాలకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఏకంగా ఒంగోలు మేయర్ సుజాత రాజీనామా చేశారు.

ఇటు ఇంకొల్లు జెడ్పీటీసీ భవనం శ్రీలక్ష్మి, కారంచేడు జెడ్పీటీసీ యార్లగడ్డ రజిని, చినగంజాం జెడ్పీటీసీలతో పాటు పలువురు ఎంపీపీలు రాజీనామా చేశారు. ఒంగోలు జిల్లా పరిషత్‌ కార్యాలయంలో తమ రాజీనామాలు అందజేశారు. అలాగే ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలో సామినేని ఉదయభాను అనుచరులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మంత్రి పదవి ఆశించి ఉదయభాను భంగపడ్డారు.

దీంతో మనస్తాపంతో అజ్ఞాతంలోకి వెళ్లారు. ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఆయన్ను కాంటాక్ట్ లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అటు.. ఉదయభాను అనుచరులు అధిష్టానంపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి మంత్రి పదవి ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుచ్చయ్యపేట మండలం వడ్డాది నాలుగు రోడ్ల జంక్షన్‌లో బైఠాయించి నిరసన తెలిపారు.

జిల్లాలో మంత్రి పదవులు ఇచ్చిన వారిలో అందరికంటే ధర్మశ్రీ సీనియర్‌ అని తెలిపారు. అలాగే వైసీపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌లు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమయ్యారు. అసంతృప్త నేతలతో చర్చించామని... వారంతా అర్థం చేసుకుంటున్నారని అన్నారు ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి. కొన్ని జిల్లాలకు చెందినవారికి మంత్రి పదవులు దక్కలేదని... సామాజిక సమీకరణాల బట్టే కేబినెట్‌లో చోటు ఉంటుందన్నారు.

సీఎం జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఆనం రామనారాయణరెడ్డి. రెండో విడత కేబినెట్‌లో కూడా తనకు చోటు దక్కకపోయినా జగన్‌కు ఆనం పాలాభిషేకం చేయడం విశేషం. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన ఈ ఘటన ఉమ్మడి నెల్లూరులోని డక్కిలిలో జరిగింది. మొత్తం మీద జగన్‌ సర్కార్‌ కేబినెట్ కూర్పుతో పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు, అసంతృప్తులు మరోసారి రచ్చకెక్కాయి.

Tags:    

Similar News