తిరుమల వెంకన్న లడ్డూ కల్తీ అంశంతో ఏపీలో రాజకీ యాలు వేడెక్కాయి. తాజాగా ఈ అంశంపై ఆధ్మాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ స్పందించారు. ఈ ఘటన క్షమించరానిదని.. హిందువులు తీవ్రంగా మనోవేదనకు గురయ్యారన్నారు. లడ్డూకే పరిమితం చేయకుండా తిరుమల ఆలయంలోని మిగతా అన్ని పదార్థాలను తనిఖీ చేయాలని సూచించారు.
1857లో సిపాయిల తిరుగుబాటు ఎలా జరిగిందో చరిత్ర పుస్తకాల్లో చదివామని.. లడ్డూ కారణంగా హిందువుల మనోభావాలు ఎలా దెబ్బతిన్నాయో ఇప్పుడు చూస్తున్నామని విచారం వ్యక్తం చేశారు రవిశంకర్. ఇందులో ప్రమేయం ఉన్నవారిని శిక్షించాలని, వారి ఆస్తులను జప్తు చేసి జైల్లో పెట్టాలన్నారు. ఈ సందర్భంగా మార్కెట్లో లభిస్తున్న నెయ్యి సంగతేంటని ఆయన ప్రశ్నించారు. ఆ నెయ్యిలో ఏం కలుస్తుందో ఎవరైనా తనిఖీ చేశారా? అని ప్రశ్నించారు.
ఆహారపదార్థాలకు కల్తీ చేస్తూ శాఖాహారం అని పిలిచే వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. ఆలయాల నిర్వహణ సాధువులు, ఆధ్యాత్మిక వేత్తల పర్యవేక్షణలో ఉండేలా చూడాలని, ఇలాంటి ఘటనలు మున్ముందు జరగకుండా ఉండేందుకు ఎస్జీపీసీ వంటి మతపరమైన బోర్డులను తీసుకురావాలన్నారు.