AP : గంజాయి సప్లై చేస్తే కఠిన చర్యలు.. ఆస్తులు అటాచ్..ఈగల్ చీఫ్ వార్నింగ్
ఏపీలో డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని ఈగల్ చీఫ్ రవికృష్ణ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లలో విస్తృత తనిఖీలు చేపట్టారు. కోరమండల్ రైల్లో తరలిస్తున్న గంజాయిని పట్టుకుని సీజ్ చేశారు.గంజాయి సప్లై చేస్తున్న వారిని గుర్తించి వారి ఆస్తులను అటాచ్ చేశామని రవికృష్ణ తెలిపారు. గంజాయి అమ్మినా, కొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏపీలో ఎట్టి పరిస్థితుల్లోనూ గంజాయి సరఫరాను అడ్డుకొని తీరుతామన్నారు. రైళ్లలో ఇతర రాష్ట్రాలకు గంజాయి రవాణా చేస్తున్నట్లు గుర్తించామని.. అందుకే అన్ని రైల్వే స్టేషన్లలో తనిఖీలు చేపట్టిన వెల్లడించారు.
ఇప్పటివరకు 21వేల కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఈగల్ చీఫ్ రవికృష్ణ తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించామని డ్రోన్ సహాయంతో సాగు చేస్తున్న పంటను గుర్తించి వాటిని నాశనం చేస్తున్నామన్నారు. గంజాయి సాగుకు ప్రత్యామ్నాయంగా పంటలు సాగు చేయిస్తున్నట్లు తెలిపారు. డ్రోన్ల సహాయంతో పోలీసింగ్ నిర్వహించడంతో గంజాయి సాగు చేసేవారిలో పూర్తిస్థాయి భయం ఏర్పడిందన్నారు.